హైదరాబాద్ : మహాన‘గరం’చల్లబడింది.. అప్పటిదాక ఎండలు నిప్పులు చెరిగాయి.. ఒక్కసారిగా వానజల్లులు పలకరించాయి.. ఉక్కపోసింది.. అంతలోనే ఉపశమనం ఇచ్చింది.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు భానుడి భగభగలు.. ఆ తర్వాత వరుణుడి పలకరింపు.. వాస్తవానికి సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 37.7 డిగ్రీల సెల్సియస్ నుంచి 38.1 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది.
అనూహ్యంగా వాతావరణం చల్లబడటమే కాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాజేంద్రనగర్, ఖైరతాబాద్, మూసాపేట, సికింద్రాబాద్, అబిడ్స్, ఉప్పల్, ఎల్బీ నగర్, చార్మినార్ పరిసరాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.
వర్షం వల్ల సచివాలయం, ట్యాంక్‌బండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో వాహనదారులు, పాదచారులు చాలా ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మరో రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో ఇటువంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.


