చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పేదరిక నిర్మూలనకు నడుం బిగించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పీ4 వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రభుత్వం పీ4 కార్యక్రమం చేపట్టిందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 12 శాతం కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయన్నారు. ఉపాధి లేకపోవడం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విద్యాలోపాలు ఈ కుటుంబాల వెనుకుబాటుకు ప్రధాన కారణాలని చెప్పారు. ఈ కుటుంబాలను అభివృద్ధి పథకంలోకి తీసుకొచ్చేందుకు పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలన్నారు. బెంగుళూరుకు చెందిన ఒక సంస్థ 100 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించిందన్నారు. ఎన్‌ఆర్‌ఐ సంస్థలు పాఠశాలలను దత్తత తీసుకోవడం వంటి అంశాలను కొనియాడారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, సంఘాలు కనీసం 50 నుంచి 200 కుటుంబాలను దత్తత తీసుకుని మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, డీఆర్‌వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు.


