‘గుంజు’కొని డబ్బులు ఎగ్గొట్టారు | Chittoor Mango Farmers Protest At Chittoor | Sakshi
Sakshi News home page

‘గుంజు’కొని డబ్బులు ఎగ్గొట్టారు

Apr 1 2026 5:52 AM | Updated on Apr 1 2026 5:52 AM

Chittoor Mango Farmers Protest At Chittoor

చెర్లోపల్లి గుజ్జు ఫ్యాక్టరీ ఎదుట దీక్షలో రైతులు

చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు ఫ్యాక్టరీని ముట్టడించిన రైతులు.. రూ.3 కోట్ల బకాయిలివ్వాలని డిమాండ్‌

బిల్లులు చెల్లించే వరకు కదలబోమని భీషి్మంచి బైఠాయింపు.. అక్కడే వంటావార్పుతో దీక్ష  

స్పందించని చంద్రబాబు సర్కారుపై ఫైర్‌

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): అరకొర ధరకు మామిడిని కొన్న చెర్లోపల్లి గుజ్జు ఫ్యాక్టరీ ఏడాది అవుతున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంపై కర్షకులు కదంతొక్కారు. బకాయి బిల్లులు తక్షణం చెల్లించాలని నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరుజిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు మంగళవారం తరలివచ్చి ఫ్యాక్టరీని చుట్టిముట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి వంటావార్పు చేపట్టారు. బిల్లులు చెల్లించే వరకు కదిలేది లేదంటూ భీషి్మంచారు. అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టామని.. వడ్డీలు పెరుగుతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం కనికరించడం లేదని, చెల్లింపులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు జోక్యం చేసుకుని బిల్లులు మంజూరు చేయించాలని డిమాండ్‌ చేశారు.   

రూ.3 కోట్ల బకాయిలు 
ఏడాది క్రితం చిత్తూరుతో పాటు తవణంపల్లి, బంగారుపాళ్యం, యాదమరి, ఐరాల తదితర మండలాల నుంచి రైతులు వేలాది టన్నుల మామిడి పంటను ఫ్యాక్టరీకి తరలించారు. కానీ ఇప్పటికీ వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.3 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై ఆగస్టు నుంచి పోరాడుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే  90 శాతం మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేసిందని, అయినా తమకు రావాల్సిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదని రైతులు విమర్శించారు.  

గుజ్జును తరలించే కంటైనర్ల అడ్డగింత  
ఫ్యాక్టరీ నుంచి గుజ్జును తరలించేందుకు వచ్చిన మూడు కంటైనర్లను రైతులు అడ్డుకున్నారు. అంతేకాకుండా మరో రెండు కంటైనర్లను వెంబడిస్తూ నిరసనను మరింత ఉధృతం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు యతి్నంచారు. డబ్బులు చేతికి అందే వరకు కదలబోమని రైతులు భీషి్మంచడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. దీంతో రైతులు అక్కడే వంటావార్పు చేపట్టి దీక్షను కొనసాగిస్తున్నారు. పిల్లలు, మహిళలు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.   

బాబు సర్కారుకు పట్టదా? 
‘రైతు సమస్యలను పట్టించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది’ అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఫ్యాక్టరీ చెల్లింపులు చేయలేదని, దీనిపై తాము ఆగస్టు నుంచి ఆందోళనలు చేస్తున్నా బాబు సర్కారుకు పట్టడం లేదని విమర్శించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కూటమి నేతలు ఏ ఒక్కరూ మామిడి రైతు సమస్యలపై నోరెత్తకపోవడంపై మండిపడ్డారు.

ఎన్నాళ్లు తిరగాలి ?
నేను ఫ్యాక్టరీకి 50 టన్నుల కాయలు పంపించాను. రూ.3 లక్షల వరకు బిల్లులు రావాలి. ఎన్నాళ్లని తిరిగేది..?. ఇది చాలా దారుణం. మా కష్టాలను కూడా పట్టించుకోవాలి. బిల్లు­లు ఇచ్చేంత వరకు దీక్షను కొనసాగిస్తాం.  – శరత్‌బాబు, తెల్లగుండ్లపల్లి, యాదమరి మండలం  

బిల్లులు ఇవ్వకుంటే కదలం బిల్లులు అడిగితే 
అదిగో.. ఇదిగో అంటూ ఏడాదిగా నెట్టుకొచ్చారు. ఇప్పుడు గుజ్జు మొత్తం ఖాళీ చేసేశారు. 90శాతం గుజ్జు మొత్తం ఎత్తికెళ్లిపోయారు. మా డబ్బులు ఇవ్వకుండానే గుజ్జు తరలిస్తే ఎలా? బిల్లులు ఇవ్వకుండా మేము గేటు తీయం. దీక్ష వదలం. బిల్లులు ఇవ్వకుంటే దీక్షను ఇంకా ఉధృతం చేస్తాం.  – జనార్దన్, తవణంపల్లి మండలం 

Advertisement
 
Advertisement
Advertisement