దళిత కుటుంబం ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబం ఆత్మహత్యాయత్నం

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: న్యాయం చేయాలని కోరుతూ ఓ దళిత కుంటుంబం మంగళవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. గత మూడు రోజుల కిందట చిత్తూరు నగరంలోని కట్టుకాలువ వీధికి చెందిన యువతి, బుల్లెట్‌ సురేష్‌ లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన విషయం విధితమే. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. చిత్తూరు నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఒంటిపై కిరోసిన్‌, పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన చిత్తూరు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు దాన్ని భగ్నం చేశారు. బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించారు. బుల్లెట్‌ సురేష్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. తాము ఎదుర్కొంటున్న న్యాయకష్టాలు పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దళిత సంఘ నేతలు కూడా భగ్గుమన్నారు. ఈ క్రమంలో చిత్తూరు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ నెట్టికంటయ్య బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.

బుల్లెట్‌ సురేష్‌పై అట్రాసిటీ కేసు

చిత్తూరు అర్బన్‌: దళిత మహిళను కులం పేరుతో ధూషించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై చిత్తూరుకు చెందిన బుల్లెట్‌ సురేష్‌తో సహా ఆరుగురిపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. టూటౌన్‌ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. తనవద్ద పనిచేస్తూ తన ఖరీదైన చేతి గడియారం దొంగతనం చేశారనే ఆరోపణలపై నగరంలోని కయినికట్టు వీధికి చెందిన ఓ దళిత మహిళను గతేడాది అక్టోబర్‌ 5న బుల్లెట్‌ సురేష్‌ తన కార్యాలయానికి పిలిపించాడు. మహిళతో పాటు ఆమె తల్లిపై దాడిచేసి, కులం పేరుతో ధూషించాడు. ఆపై లైంగిక వేధింపులకు పాల్పడడం, తుపాకీతో బెదిరించాడని ఇటీవల ఓ కుటుంబం వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మహిళ టూటౌన్‌ పోలీసులకు ఇదే విషయమై రాత పూర్వక ఫిర్యాదు అందచేశారు. దీనిపై స్పందించిన పోలీసులు బుల్లెట్‌ సురేష్‌, అతని కుమారుడు సాయిబాలాజీ అలియాస్‌ అప్పు, భార్య భారతితోపాటు రామారావు, ప్రశాంత్‌, ప్రవీణ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ, లైంగిక వేధింపులు, ఎస్సీ మహిళపై దాడి, తుపాకీ చూపించి బెదిరించడం లాంటి వాటిపై కేసు పెట్టినట్లు సీఐ తెలిపారు.

మహిళల భద్రతే లక్ష్యం

చిత్తూరు కలెక్టరేట్‌ : నేటి బాలికలే రేపటి పౌరులని ఏఎస్పీ రాజశేఖర్‌రాజు అన్నారు. మంగళవారం నగరంలోని మిట్టూరులో ఉన్న ఆర్‌కే డిగ్రీ కళాశాలలో బాల్య వివాహాల నిరోధకం, పోక్సోచట్టం, శక్తి యాప్‌ వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు, మహిళల భద్రతే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ముందుకు సాగుతోందన్నారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టవిరుద్ధమన్నారు. విద్యార్థులు తమ కాళ్లపై తాము నిలబడే వరకు వివాహాల జోలికి వెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌కే ప్రిన్సిపల్‌ రమేష్‌బాబు పాల్గొన్నారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో నిందితుడికి జైలు

తిరుపతి లీగల్‌: చెక్‌ బౌన్స్‌ కేసులో చిత్తూరు, కొంగారెడ్డిపల్లి, నీలా ఎన్‌ క్లేవ్‌కు చెందిన పీఎస్‌ ప్రేమ్‌కృష్ణ కు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్‌ జడ్జి పి కోటేశ్వరరావు మంగళవారం తీర్పు చెప్పారు. పాకాల మండలం, బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన పి జయ చంద్రారెడ్డి వద్ద ప్రేమ్‌కృష్ణ 2017 జూన్‌ 15వ తేదీ రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దానికి గాను ప్రేమ్‌కృష్ణ ఓ ప్రో నోటును రాసి ఇచ్చాడు. ఆ సొమ్ము అసలు, వడ్డీ చెల్లించే క్రమంలో 2018 జూలై 20వ తేదీ ప్రేమ్‌కృష్ణ రూ.5 లక్షల విలువ చేసే చెక్కును జయచంద్ర రెడ్డికి ఇచ్చాడు. అతను ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్‌ అయింది. దీంతో జయచంద్రారెడ్డి కోర్టులో ప్రేమ్‌కృష్ణ పై చెక్కు బౌన్స్‌ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రేమ్‌ కృష్ణకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

ఉద్యోగమేళాకు విశేష స్పందన

– 158 మందికి ఉద్యోగ అవకాశాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించినట్లు ప్రిన్సిపల్‌ డా.జీవనజ్యోతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ సంయుక్తంగా ఈ ఉద్యోగ మేళా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యోగ మేళాకు జిల్లాలోని నలుమూలల నుంచి 347 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. వివిధ బహుళజాతి కంపెనీలు నిర్వహించిన రాత, ముఖాముఖి పరీక్షల్లో అభ్యర్థులు తమ ప్రతిభను చాటుకున్నట్లు తెలిపారు. ఈ మేళాలో 158 మంది ఎంపికకాగ, 42 మందిని వివిధ కంపెనీలు షార్ట్‌లిస్ట్‌ చేశాయన్నారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేశారు. జేకేసీ నోడల్‌ అధికారి ప్రసాద్‌, జేకేసీ ఎఫ్‌టీఎం నారాయణరావ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement