చిత్తూరు కలెక్టరేట్ : కుప్పం నుంచే అధికంగా రెవెన్యూ సమస్యలు నమోదవుతున్నాయని ఇన్‌చార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమీక్ష మండలి సమావేశం నిర్వహించారు. ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ ‘రెవెన్యూ సమస్యల పరిష్కారం జఠిలంగా ఎందుకు మారుతోందని అన్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు, సర్వేయర్ల నిర్లిప్త వైఖరితో ప్రజలు అవస్థలు పడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కుప్పం డివిజన్లో అధికంగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయన్నారు. ‘అపోలో ఆస్పత్రి సేవలు చైన్నె, హైదరాబాద్‌లో బాగుంటున్నా.. చిత్తూరులోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవల్లో ఆశించిన ఫలితం లేదు ఎందుకని ప్రశ్నించారు. చిత్తూరులోని అపోలో ఆస్పత్రి నిర్వహణలో లోపాలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలో గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ వేసవిలో ఎక్కడా తాగునీటికి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు అమలుచేయాలన్నారు.
సిబ్బంది కొరత అధిగమిస్తాం
కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ బిల్లులు వెంటనే అప్‌లోడ్ చేయాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాలజగన్‌మోహన్ మాట్లాడుతూ అపోలో ఆస్పత్రిలో నియమించిన అభివృద్ధి కమిటీ సభ్యుల వినతుల్ని సైతం యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ అమరావతి నుంచి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి నూతన ఆర్టీసీ సర్వీసును ప్రారంభించాలన్నారు. రేషన్ దుకాణాల్లో అవకతవకలపై ఆధారాలతో పట్టించినా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. నగర మేయర్ అముద, చూడా చైర్ పర్సన్ హేమలత, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్‌రాజు, డీఆర్‌ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.


