చిత్తూరు రూరల్ (కాణిపాకం): అపోలో సహకారంతో పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్టు జిల్లా రవాణశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ట్రామా కేర్ సెంటర్, నూతన హంగులు దిద్దిన అత్యవసర విభాగాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆసుపత్రిని అపోలో సంస్థ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. రోగి ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని వైద్య సేవలను మెరుగుపరిచే చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైన సందర్భాల్లో చైన్నె, బెంగళూరు నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన బాధితులకు తక్షణమే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ ట్రామా కేర్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ విభాగంలో 60 పడకలను అత్యవసర వైద్య సేవల కోసం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ట్రామా కేర్ సెంటర్లో అత్యాధునిక వెంటిలేటర్లు, హీమోడైనమిక్ మానిటరింగ్ సిస్టమ్స్, డిజిటల్ ఎక్స్‌రే, పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ విభాగంలోనే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, మురళీమోహన్, అపోలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్.వినోద్‌భట్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు, ఏఐఎంఎస్‌ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జె అగస్టీన్, యూనిట్ హెడ్ ఎస్.బాలరాజ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ పాల్గొన్నారు.


