చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులతో కలెక్టరేట్ జనసముద్రాన్ని తలపించింది. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. సమస్యలను అర్జీల రూపంలో అందజేసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్‌లు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులను పిలిచి అక్కడికక్కడే వివరణ కోరాదు. క్షేత్ర స్థాయిలో మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్‌లో పట్టాదారు పాసు పుస్తకం
పలమనేరు మండలం, బాగ్యప్పగారిపల్లెకు చెందిన వై.నారాయణ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో తన సమస్యను విన్నవించుకున్నారు. సర్వే నం.38,35/6,41/1 లో తన భూమికి సంబంధించి పట్టా ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. సమస్య పరిష్కరించాలని తహసీల్దార్‌ను వేడుకుంటే ఇష్టం ఉన్న వాళ్ల వద్దకెళ్లి చెప్పుకో.. న్యాయం చేసేది లేదంటూ అలసత్వంగా సమాధానం ఇస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పీఎం చిత్రపటంతో నిరసన
తన భూ సమస్య పరిష్కరించాలంటూ 75 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణ యాదవ్ కలెక్టరేట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటంతో నిరసన చేపట్టారు. యాదమరిమండలం, మాదిరెడ్డిపల్లిలో సర్వే నం.26/1లో 4.87 ఎకరాల భూమి ఓ మాజీ సైనికుడు భార్య పేరుతో డీకేటీ పట్టా మంజూరైందన్నారు. అనంతరం ఆ భూమిని తాను కొనుగోలు చేశానన్నారు. 1990లో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో రుణం పొంది, 2010 లో పూర్తిగా చెల్లించినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్రమంగా పన్ను చెల్లిస్తున్నానని, అయినా తన భూమికి సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదైన అక్రమ పేర్లను తొలగించలేదన్నారు. తన సమస్య పరిష్కారానికి ప్రధానమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు నమోదు చేసినట్లు బాధితుడు వెల్లడించారు.
మద్యం షాపు తొలగించాలి
గంగాధరనెల్లూరు మండలం, పెద్దకాలవ గ్రామం (టానా సర్కిల్, ఎన్‌టీఆర్ కాలనీ వద్ద) ఇళ్ల మధ్యలో మద్యం షాపు పెట్టారని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు బాధితురాలు విజయలక్ష్మి, గ్రామస్తులు వెల్లడించారు. ఉదయం 6 నుంచి రాత్రి 12.30 గంటల వరకు షాపు నడుపుతున్నారని చెప్పారు. మహిళలు, పాఠశాల, కళాశాలకు వెళ్లే మహిళలు మందుబాబుల ఆగడాలకు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. ఆ షాపును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో విద్య, రూప, మహిత, పద్మ, తులసి, ఉష పాల్గొన్నారు.
ఇళ్ల పట్టాల కోసం నిరీక్షణ
గంగాధరనెల్లూరు మండలం, కొత్త ఎన్‌హెచ్ కాలనీకి చెందిన బాబు, తదితరులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. తాము గత 30 ఏళ్లుగా సర్వే నం.571/1 లో నివసిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పటికీ తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదని వాపోయారు. కొందరు అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేస్తున్నారని వారు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ గ్రామ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరారు.


