రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం
నారాయణస్వామి
పాలసముద్రం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణశాసనం రాశారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటుగా విమర్శించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నివర్శనమన్నారు. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల పెట్టిన లిఫ్ట్‌ఇరిగేషన్ స్కీంను ఆపేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి మేలు జరగదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా తెచ్చి పూర్తి చేయలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం ఈ ప్రాంతవాసుల దురదృష్ట కరమన్నారు. శ్రీశైలంలో 880 అడుగుల నీటి మట్టం ఉంటేనే రాయలసీమ నీటిని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గుర్తు చేశారు. ఆ నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుపడినా ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడారన్నారు. 854 అడుగుల వద్ద 7వేల క్యూసెక్కులు, 841 అడుగుల వద్ద 2వేల క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు వీలుంటుందన్నారు. శ్రీశైలంలో ఏపీకి 101 టీఎంసీల నికర జలాలు కేటాయించారని, విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ 795 అడుగులకు వచ్చేసరికి వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. దీంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోందని చెప్పారు. రాయలసీమ వాసుల ప్రయోజనాలు కాపాడేందుకు వైఎస్సార్ సీపీ ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.


