ఆరునూరైనా పోరాటమే!
మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు రోడ్డున పడేశాయి
గంగాధరనెల్లూరు : జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలు సిండికేట్‌గా మారి మామిడి రైతులను రోడ్డున పడేశాయని మామిడి రైతు సంఘ నేతలు మండిపడ్డారు. గంగాధరనెల్లూరు మండల కేంద్రంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బుధవారం నిరసన తెలియజేశారు. ప్రభుత్వం మామిడి రైతుల కష్టాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. నాడు రైతు సంఘాల నాయకులతో కలెక్టర్ ఆధ్వర్యంలో కిలోకు రూ.8 గిట్టుబాటు ధర ఇస్తామని హామీ ఇవ్వగా, ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాటతప్పాయన్నారు. నేడు రూ.6, రూ.4 ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయశాఖా మంత్రి అచ్చెన్నాయుడు కిలోకు రూ.8 ఇవ్వమని చెప్పినా ఏ ఒక్క ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా పట్టించుకోలేదన్నారు. జనవరి 14వ తేదీ ముఖ్యమంత్రిని కలిసి అక్కడే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
వడ్డీకి కూడా రాలేదు
చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు చాలావరకు అప్పులు తెచ్చి మందులు పిచికారీ చేశారని, వేలాది రూపాయలు ట్రాక్టర్ బాడుగలు వెచ్చించి, రోజుల తరబడి రోడ్లపై పడిగాపులు కాసి ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కాయలు తోలామని తెలిపారు. నేడు మద్దతు ధర ఇవ్వకుండా రైతు కడుపు కొట్టే పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం మంచి పద్ధతి కాదన్నారు.
భారీ పోలీసు భద్రత
మామిడి రైతుల నిరసన కార్యక్రమంలో భాగంగా జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రైతు సంఘాల నాయకులతో మాట్లాడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలతో చర్చలు జరిపి సంక్రాంతి లోపు డబ్బులు వచ్చేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.
రూ.6కు ఒప్పందం.. ఆపై వాగ్వాదం
గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలతో చర్చలు సందర్భంగా రైతు సంఘ నాయకులు మీడియా ముందు ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకున్నారు. రైతు సంఘాల నాయకులు హరిబాబు చౌదరి, కొత్తూరు బాబు మాట్లాడుతుండగా మధ్యలో చంద్రశేఖర్ నాయుడు కలుగజేసుకుని రూ.6కు ఎలా ఒప్పుకుంటారని నిలదీశారు. ఆపై ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ?
మామిడి రైతులు ఇబ్బందులు పడుతుంటే బాబు ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ..? అని మామిడి రైతు సంఘ నాయకుడు ఆనంద నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ నాయకులు మామిడి రైతులతో చెలగాటమాడుతున్నారని, మామిడి రైతుల కన్నీరు ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా తుడవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరునూరైనా పోరాటమే!
ఆరునూరైనా పోరాటమే!


