రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా ఆస్పపత్రిలో పీపీపీ పద్ధతిలో రోగులకు సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో బుధవారం పీపీపీ పద్ధతిలో రోగులకు సూపర్ స్పెషాలిటీ సౌకర్యాల కల్పనపై వివిధ వార్డులను కలెక్టర్, ఎంపీ ప్రసాదరావు, అపోలో నిర్వాహకులతో కలిసి పరిశీలించారు. ఆస్పత్రిలో అపోలో నిర్వాహకులు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు, ఎమర్జెన్సీ విభాగం విస్తరణ, అలాగే పార్కింగ్ సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించారు. సుమారు 450 పడకలు పునర్నిర్మాణ ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వివిధ వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న సేవల నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ హోదాలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి, సూపరింటెండెంట్ ఉషశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి పాల్గొన్నారు.


