ట్రాక్టర్ బోల్తా
ఐరాల: హంద్రీ–నీవా కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి కాలు విరిగిన ఘటన మంగళవారం మండలంలోని యల్లంపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం.. యల్లంపల్లెకు చెందిన రైతు బాబునాయుడు తన సొంత ట్రాక్టర్‌లో గ్రామ శివారులో ఉన్న పొలం వద్దకు మట్టి రోడ్డుపై తీసుకెళ్తున్నాడు. ట్రాక్టర్ అదుపు తప్పి హంద్రీ–నీవా కాలువలోకి దూసుకెళ్లింది. పొలాలకు వెళ్తున్న రైతులు గమనించి బాబునాయుడిని కాలువ నుంచి బయటకు తీశారు. అప్పటికే కాలు విరిగింది. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు హంద్రీ–నీవా కాలువలోకి నీరు చేరి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాలువపై కల్వర్టు లేకపోవడంతో ఈ మార్గం ద్వారా మిరియం గంగనపల్లె, ఎస్టీ కాలనీ, బెల్లంగోవిందరెడ్డిపల్లెకు ప్రయాణం సాగించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలువపై కల్వర్డు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మద్యం దుకాణంలో చోరీ
వి.కోట : స్థానిక కేజీఎఫ్ రోడ్డులోని ఆంధ్రా వైన్స్ షాపులో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం పైకప్పు షీట్‌లను కట్ చేసి లోపలికి చొరబడ్డారు. రూ.50వేల విలువైన మద్యం సీసాను అపహరించారు. దుకాణం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.


