అండగా వన్ స్టాప్ సెంటర్
చిత్తూరు కలెక్టరేట్ : సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు సఖి వన్ స్టాప్ సెంటర్ అండగా ఉంటుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. సఖి వాహనాన్ని సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లా డుతూ చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో వన్ స్టాప్ సెంటరు ఏర్పాటు చేశామన్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఈ కేంద్రాన్ని సంప్రదిస్తే.. ఉచిత కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పోలీసు సహాయం, వైద్య సహాయంతోపాటు ఆశ్రయాన్ని కల్పిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో 181 హెల్ప్ లైన్ నంబరులో సంప్రదించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాను
చంద్రబాబే చిత్తు చేశారు!
– జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ధ్వజం
పలమనేరు: రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు తన సొంత జిల్లాకు చేసేందేమీ లేదని, ఆయన సొంత నియోజక వర్గం నుంచే నిత్యం వేలాది మంది పనుల కోసం కర్ణాటకలోని బెంగళూరుకు వలస వెళ్తున్నారని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. పలమనేరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కారణంగా చిత్తూరు ఎందుకూ పనికి రాకుండా పోయిందన్నారు. గతంలో జిల్లాకు కేంద్ర నిధులతోపాటు రాష్ట్ర నిధులు వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాల్లోని పొరుగు జిల్లాలు అభివృద్ధిపరంగా దూసుకుపోతుండగా చిత్తూరు జిల్లా మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఇక్కడ పరిశ్రమలు గానీ, ఓ యూనివర్సిటీగానీ, రైతులకు హార్టికల్చర్‌పై ఎలాంటి చర్యలు లేవన్నారు. సత్యవేడులో సెజ్ లాగా చిత్తూరులో ఎక్కడుందన్నారు. ఇప్పుడు హంద్రీనీవా కాలువలో వస్తున్న నీరు నాటి ప్రభు త్వ చలువేనన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉద్యాన, పాడి పరిశ్రమ, పట్టు, పరిశ్రమలపై రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.


