పెల్లుబికిన జనాగ్రహం
నగరి : విషపూరిత రసాయన నీటికి వ్యతిరేకంగా జనాగ్రహం పెల్లుబికింది. సోమవారం నగరి పర్యా వరణ పరిరక్షణ సేవా సమితి, లయన్స్ క్లబ్, వాక ర్స్ అసోసియేషన్, నేషనల్ హ్యూమన్‌రైట్స్ కౌన్సి ల్, ఏఐఏఎంఎఫ్ జస్టీస్ పోరమ్‌తో కలసి నగరి ప్రజలు ‘విషం నీళ్లు వద్దు.. మంచి నీళ్లు ఇవ్వండి’ అంటూ ఉద్యమించారు. టవర్‌క్లాక్ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సి పల్ కార్యాలయం ఎదుట భీష్మించుకు నిరసన తెలిపారు. తమిళనాడు డైయింగ్ యూనిట్లను వెంటనే తరలించాలని, విషపూరిత రసాయనాలు పూర్తి స్థాయిలో నిషేధించాలని, కాలువల్లో, చెరువుల్లో, నదిలో పారుతున్న రసాయనాలకు అడ్డుకట్ట వేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
రసాయన రంగు నీటితో ఇబ్బందులు
నగరి పర్యావరణ పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ విషపూరిత రసాయన రంగునీటి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూగర్భ జలాలు కలుషితమై తాగడానికే కాకుండా స్నానానికి, వంటకు కూడా పనికిరాని స్థితిలో మారాయన్నారు. 16 భారీ డైయింగ్ యూనిట్లు లక్షల లీటర్ల నీటిని భూమి నుంచి తీసి కలుషితం చేసి వదలిపెడుతున్నాయని ఆరోపించారు. ఈ డైయింగ్ యూనిట్లు మాత్రమే వినియోగించే నీరు నగరి, నిండ్ర, విజయపురం మండలాలు మొత్తం వినియోగించే నీటితో సమానమన్నారు. ఇంతటి విషపూరిత నీరు కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో ప్రవహిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.
వారిని నగరి నుంచి సాగనంపండి
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మా ట్లాడుతూ తమిళనాడులో నిషేధించిన డైయింగ్ యూనిట్లు నగరిలో చాపకింద నీరులా ఆక్రమించి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తున్నట్టు ఆరోపించారు. తమిళనాడులో వస్త్ర ఉత్పత్తి చేసుకునే వారు వ్యర్థనీరు వదలడానికి నగరిని వాడు కుంటున్నారన్నారు. వారిని నగరి నుంచి తరిమికొట్టాలన్నారు. పర్యావరణం ఇంత కలుషితమవుతున్నాతున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసలు ఆ విభాగం జిల్లాలో ఉందా, లేదా అన్న సందేహం కలుగుతోందన్నారు.
ర్యాలీ నిర్వహిస్తున్న నగరి ప్రజలు
ధర్నాలో మాట్లాడుతున్న నగరి పర్యావరణ పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు
వ్యాధులతో సతమతం
కౌన్సిలర్ దయానిధి మాట్లాడుతూ రసాయన నీటి సమస్యలో ఇప్పటికే నగరి ప్రజలు కిడ్నీ సమస్య, క్యాన్సర్, చర్మవ్యాధులు, నరాల బలహీనత సమస్యతో సతమతమవుతున్నారని వాపోయారు. మరో ఉద్దానంలాగో, తురకపాళెంలాగో నగరి మారకముందే అధికారులు స్పందించాలన్నారు. వైద్యులు రామచంద్రన్, హరీష్ మాట్లాడుతూ మానవ శరీరంలో 70 శాతం నీరే ఉంటుందని, ఆ నీరు కలుషితంగా వాడితే ఆరోగ్య సమస్యలు తప్పవన్నారు. జీర్ణ వ్యవస్థతో పాటు శరీర భాగాలన్నింటికీ సమస్య వస్తుందన్నారు. మహా ధర్నా అనంతరం నిరసనకారులు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో సమితీ నేతలు వెంకటేశ్, మునికృష్ణ, సుబ్రమణ్యం, తిరుమలరెడ్డి, ఇంద్రయ్య, రిటైర్డ్ డీవైఈవో ప్రభాకర్‌రాజు, డాక్టర్ ఆంబ్రోస్ విల్సన్, జగన్నాథం, చిరంజీవిరెడ్డి, బాబు, ఎ.మోహన్, మహిళా సంఘాలు, లయన్స్‌క్లబ్, వాకర్స్ అసోసియేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
పెల్లుబికిన జనాగ్రహం
పెల్లుబికిన జనాగ్రహం


