తగ్గిన పంచాయతీల సంఖ్య
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాల పునఃవిభజన కారణంతో చిత్తూరు జిల్లాలో పంచాయతీల సంఖ్య తగ్గింది. 696 పంచాయతీలు ఉన్న జిల్లాలో ఆ సంఖ్య 621కి తగ్గింది. దీంతో 75 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన మదనపల్లెకు వెళ్లిపోయాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం మండలాలను మదనపల్లె జిల్లాలో కలపడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది. 2022 ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లా మూడుగా విడిపోగా చిత్తూరు జిల్లాకు 31 మండలాలు మిగిలాయి. చిత్తూరు మండలాన్ని అర్బన్, రూరల్ పునర్విభజన చేయడంతో మండలాల సంఖ్య 32కు చేరింది. తాజా విభజనతో మండలాల సంఖ్య 28కి చేరగా, పంచాయతీల సంఖ్య 621కు చేరింది. దీనికి తోడు కొత్త పంచాయతీల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 17 కొత్త పంచాయతీల ఏర్పాటుకు నిబంధనల మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగిశాక జిల్లా విభజన చేసుంటే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.
డ్రిప్ ఏర్పాటుకు రాయితీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా డ్రిప్ ఏర్పాటుకు రాయితీలు అందిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 95,752 హెక్టార్ల విస్తీర్ణంలో డ్రిప్ అమలుకు అవకాశం ఉందన్నారు. కూరగాయలు, మామిడి, పూల సాగుకు డ్రిప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ పీవీరమణ పాల్గొన్నారు.
స్క్రబ్ టైఫస్‌పై ప్రత్యేక టీమ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు అధికంగా నమోదు కావడంతో చైన్నె నుంచి ఐసీఎంఆర్ బృందం సోమవారం చిత్తూరుకు చేరుకుంది. హిమబిందురెడ్డి, శంకర్, ధనశ్రీ, అన్సారి, సురేష్, ఇలవర్సన్, విశ్వనాథ్ వ్యాధిపై పరిశోధన చేపట్టారు. తొలిరోజు యాదమరి మండలం కీనాటంపల్లి పర్యటించి రక్తనమూనాలు సేకరించారు. మంగళవారం బంగారుపాళ్యం మండలం చెరుకువారిపల్లి, గంగాధరనెల్లూరు మండలం ముక్కళ్లత్తూరు, బుధవారం గుడిపాల మండలం 189 కొత్తపల్లి, ఎస్‌ఆర్‌పురం మండలం కొత్తపల్లిమిట్ట, గు రువారం ఐరాల మండలం ఎర్లంపల్లి గ్రా మా ల్లో పర్యటించనున్నారు. కాగా డీఎంఅండ్‌హెచ్ సుధారాణిని కలిసి టైపస్ వ్యాధిపై చర్చించారు.
తగ్గిన పంచాయతీల సంఖ్య


