
కలంపై కక్ష
తిరుపతి అర్బన్ : ‘సీఎం చంద్రబాబు జర్నలిస్టులతో రాజకీయం చేయ డం మంచి పద్ధతి కాదు.. రాష్ట్ర చరిత్రలో ఓ వార్త ప్రచురించారని ఏకంగా ఎడిటర్‌పై కేసు పెట్టడం ఇప్పటి వరకు జరగలేదు’ అంటూ తిరుపతి పాత్రికేయులు కూటమి సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సాక్షి కార్యాలయానికి పోలీసులు వెళ్లడం.. ఎడిటర్ ధనంజయరెడ్డిని ప్రశ్నించడంపై వారు మండిపడ్డారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా తిరుపతిలోని బస్టాండ్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి
సమాజంలో జరుగుతున్న మంచితో పాటు చెడును తెలియజేయడం ద్వారా అధికార యంత్రాంగం తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పత్రికలు పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వ ఆలోచన మాత్రం మరోలా ఉందని మండిపడ్డారు. తప్పొప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి జర్నలిస్టులు భజన చేయాలని భావించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సాక్షి ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆర్.మురళి, కార్యదర్శి పి.బాలచంద్ర, ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.గిరిబాబు, ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు మబ్బు నారాయణరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు నగేష్, విజయయాదవ్ తదితరులు పాల్గొన్నారు.