
చిత్తూరులో బీసీ నేతపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరు నగరంలో కూటమి పార్టీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు అనుచరులు రెచ్చిపోయారు. సొంత పార్టీ సీనియర్ నాయకుడు, టీడీపీ బీసీ నేత సంతపేట ఈశ్వర్‌పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఈశ్వర్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన ఈశ్వర్ టీడీపీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నాడు. ఈశ్వర్ తొలి నుంచి స్థానిక టీడీపీ నేత పులివర్తి నాని అనుచరుడిగా ఉన్నాడు. తాజాగా మంగళవారం ఈశ్వర్ అన్నకుమారుడు గోపి చిత్తూరు నగరంలోని మామిడి కాయల మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణం వద్దకు వెళ్లారు. టపాకాయలు కొంటూ రూ.500 పోగొట్టుకున్నాడు. దీంతో ఈశ్వర్‌కు ఫోన్‌చేసి, రూ.500 పంపాలని కోరగా, ఈశ్వర్‌తో పాటు అతని కుమారులు వంశీకృష్ణ, భార్గవ్ టపాకాయల దుకాణం వద్దకు వచ్చారు. అప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు మౌళి మరో 20 మంది కలిసి గోపిపై దాడికి పాల్పడ్డారు. దీన్ని ప్రశ్నించిన ఈశ్వర్, అతని కుమారులు వంశీకృష్ణ, భార్గవ్‌పై దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు పిడిగుద్దులు కురిపించారు. దెబ్బలను తట్టుకోలేక ఈశ్వర్, అతని కుమారులు పరుగులు తీస్తూ గేటు బయటకు వచ్చేశారు. అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్టీ కోసం 30 ఏళ్లకు పైగా జెండా మోసిన తనకు, టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన తన కుమారుడు వంశీకృష్ణను అందరూ చూస్తుండగానే కొట్టి.. కొట్టి తరిమారని.. ఎమ్మెల్యే అనుచరుడు మౌళి మరో 30 మంది కొట్టారంటూ ఈశ్వర్ కన్నీటి పర్వంతమయ్యాడు.