ఉపాధి దొంగలు దొరికేనా! | - | Sakshi
Sakshi News home page

ఉపాధి దొంగలు దొరికేనా!

Oct 22 2025 7:24 AM | Updated on Oct 22 2025 7:24 AM

ఉపాధి

ఉపాధి దొంగలు దొరికేనా!

నేటి నుంచి విజిలెన్స్‌ బృందం తనిఖీలు ఆందోళన చెందుతున్న ఉపాధి సిబ్బంది సద్దుమణిగించేలా తమ్ముళ్ల విశ్వ ప్రయత్నాలు? పుంగనూరులో మకాం వేసిన బృందం

గతంలో చేసిన పనులే మళ్లీ..

చౌడేపల్లె మండలంలో జేసీబీతో ఉపాధి పనులు చేస్తున్న దృశ్యం(ఫైల్‌)

చౌడేపల్లె : బూరగపల్లె వద్ద జేసీబీతో చేపట్టిన పారంపండ్‌ పనులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : పుంగనూరు నియోజకవర్గంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.65 కోట్ల మేరకు నిధులను ఉపాధి హామీ పథకంలో ఖర్చు చేసినట్లు లెక్కలు చూపి కూలీల కడుపుకొట్టి తమ్ముళ్లు తమ జేబుల్లోకి మళ్లించేశారు. నిబంధనలకు విరుద్దంగా కూలీలతో చేయాల్సిన పనులను జేసీబీ, హిటాచీలతో చేసి కూలీలే చేసినట్లు బోగస్‌ రికార్డులు తయారు చేసి తమ్ముళ్లకు ఉపాధిని కల్పించి ఆర్థికంగా ప్రోత్సహించారు. నిబంధనలకు విరుద్దంగా చెరువులు, కుంటల్లో ఇష్టానుసారంగా క్యాటిల్‌పాండ్‌ , ఫిష్‌ పాండ్‌, పారంపండ్‌ పనులకు అంచనాలు వేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులకే పనులు కేటాయించారు. కూలీలకు పనులివ్వకుండా యాంత్రాలతో పనులు చేసేసి వారికి నచ్చిన కూలీల పేరిట పనులకు వచ్చినట్లుగా తప్పుడు రికార్డులతో కోట్ల నిధులు కొల్లగొట్టారు. గ్రామసభలు నిర్వహించకుండా ఆ పనులకు గ్రామసభ తీర్మాణాలు లేకుండానే నియోజకవర్గంలో ఉపాధి నిధులు ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఈ అక్రమాలపై రాజంపేట ఎంపీ పివి. వెంకట మిథున్‌రెడ్డి ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.దీనిపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రాష్ట్ర చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ శ్రీభవాని హర్ష నేతృత్వంలో సుమారు 30 మంది బృందం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పరిశీలించనున్నారు.

అవినీతి నిగ్గు తేల్చేనా?

పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధి నిధుల అక్రమాలపై విజిలెన్స్‌ అధికారుల బృందం నిగ్గు తేల్చేనా అంటూ గ్రామాల్లో చర్చ సాగుతోంది. రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, సదుం, పుంగనూరు, చౌడేపల్లె మండలాల్లో ఏ ఒక్క పని సైతం కూలీలు చేయలేదని ఆరోపణలున్నాయి. అధికారుల బృందం పుంగనూరుకు మంగళవారం చేరుకోవడంతో ఆరు మండలాల్లోని ఉపాధి సిబ్బంది రికార్డులను సిద్ధం చేసి జెడ్పీ విశ్రాంత భవనం వద్దకు తీసుకెళ్లారు. వచ్చిన అధికారుల బృందానికి టీడీపీ నేతలు ఉన్నత స్థాయి నేతలు, అధికారుల నుంచి ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. నామమాత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోవాలని సూచించినట్లు తెలిసింది. తనిఖీల్లో ఎలాంటి అక్రమాలు వెలికితీయకుండా సద్దుమణిపించేలా కొందరు నేతలు పైరవీలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

వణుకుతున్న ఉపాధి సిబ్బంది

ఎన్నడూ లేని విధంగా విజిలెన్స్‌ అధికారులు ఉపాధి పనులను తనిఖీల కోసం రావడం, ఫైల్స్‌ అప్పగించాలని ఆదేశించడంతో ఆరు మండలాల్లోని ఉపాధి ిసిబ్బంది వణుకుతున్నారు. కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల కనుసన్నల్లో సిబ్బంది పనులు కేటాయించాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయి ఓ నేత , మండల స్థాయిలో కొందరు నేతలు జాబితా సిద్ధం చేసిన వారికే ఉపాధి పనులు కేటాయించారు. సామాన్యులకు కేటాయించలేదు. వారికి సహకరించని ఏపీడీ, ఏపీఓలు, టీఏలు, జేఈలను వేరొక మండలాలకు బదిలీ చేయించారు. ఏకంగా ఆరు మండలాల్లోని ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించేశారు. వారికి నచ్చిన వారిని నియమించుకొని రూ.కోట్లు కొల్లగొట్టారు. తామే ఉపాధి పనులకు కూలీలకు బదులు యంత్రాల ద్వారా పనులు చేయించి నేతల జేబులు నింపామని, తమను ఈ గండం నుంచి కాపాడాలని వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ప్రతి పనులను యంత్రాలతోనే..

ఉపాధి హామీ పథకంలో కూలీలతోనే పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో మట్టి పనులన్నీ చివరికి మామిడి పండ్ల తోటల పెంపకానికి గుంతలు తవ్వే పనులు కూడా యంత్రాలతోనే చేయించారు. విజిలెన్స్‌ అధికారులకు సిబ్బంది అప్పగించిన రికార్డులు, మూడు దశల ఫొటోలు పరిశీలిస్తే సిబ్బంది, పనితీరు తేట తెల్లమవుతుంది.

పేదలకు ఎక్కడ పనులిచ్చారు?

పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధి పనులు కూలీలకు కల్పించలేదు. అధికారంలోకి వచ్చాక ఈ పథకం పూర్తిగా టీడీపీ నేతల కనుసన్నల్లోకి వెళ్లిందని కూలీలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పనుల్లేక కూలీలు బయట ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. పనులు అడిగినా ఫీల్డ్‌ అసిస్టెంట్లు పట్టించుకోకపోవడంతో పాటు గ్రామీణ స్థాయిలో నేతలు చెప్పిన వారికే యంత్రాలకు పనులిస్తున్నారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

నేటి నుంచి తనిఖీలు ప్రారంభం

తనిఖీలకు కేటాయించిన విజిలెన్స్‌ సిబ్బందిని టీమ్‌లుగా విభజించి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉపాధి పనులు రికార్డులు, ఫైల్స్‌ పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించి అక్రమాలపై నివేదిక ఇవ్వనున్నారు. తనిఖీ బృందానికి అక్రమాలపై ప్రజలు వివరించి ఉపాధి పథకం ఆశయాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది.

పుంగనూరు : జేసీబీతో చేసిన పనులకు కూలీలతో మెరుగులు దిద్దుతున్న సిబ్బంది (ఫైల్‌)

చెరువుల్లో గతంలో చేసిన పనులు , రైతు పొలాల్లో చేసిన ఫారంపండ్‌ పనులను తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ వాటికే తుది మెరుగులు దిద్ది ఉపాధి నిధులు కొల్లగొట్టారు. గోకులం షెడ్లు సైతం టీడీపీ వారికే కట్టబెట్టారు. వారు వాహనాల పార్కింగ్‌ , ఇతర కార్యక్రమాల కోసం నిర్మించి ఉపాధి పథకం ఆశయాన్ని నీరుగార్చారు. పశువులు లేకపోయినా టీడీపీ నేత అయి ఉంటే చాలు అనే అర్హతతో నిధులు వృథా చేసి దోచుకొన్నారు.

గ్రామసభ తీర్మానాలు ఏవీ ?

గ్రామ స్థాయిలో పనులు గుర్తించి ఆ పనులు చేపట్టడానికి గ్రామసభ తీర్మాణం ఆమోదించాలి. తరువాత మండల పరిషత్‌ తీర్మాణం పొందాలి. ఆ పనులను పరిపాలనపరమైన అనుమతి పొందిన తరువాత పనులు చేపట్టాల్సి ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో పద్ధతి ప్రకారం ఉపాధి పనులు చేపట్టలేదు. లబ్ధి పొందేవారు టీడీపీ నేతలై ఉండాలి, ఆ పార్టీకి చెందిన నేతల సిఫార్సు ఉంటేచాలు. సిబ్బంది ఏమైనా చేసే స్థాయికి వెళ్లారు. ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే వారిపై ఆ పార్టీ ముఖ్యనేతలకు చెప్పి వారి నోరు మూయించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇలాంటి తరుణంలో ఉపాధి అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులు ఏ విధంగా తనిఖీలు చేసి నివేదిస్తారో చూడాల్సి ఉంది.

ఉపాధి దొంగలు దొరికేనా! 1
1/2

ఉపాధి దొంగలు దొరికేనా!

ఉపాధి దొంగలు దొరికేనా! 2
2/2

ఉపాధి దొంగలు దొరికేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement