పుంగనూరు : పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చిన నగలు మాయం చేశారంటూ దాత అని చెబుతున్న ఆదినారాయణ అనే వ్యక్తి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మండలంలోని ఉలవలదిన్నెకు చెందిన ఆదినారాయణ.. 352 గ్రాముల బంగారు నగలను 2008లో శ్రీవారికి విరాళంగా ఇచ్చినట్లు, ఆ నగలను అప్పటి ఈవో, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ ఏకాంబరంకు అందజేయగా, తనకు ఆ సమయంలో రశీదు ఇచ్చారని ఆరోపించారు. ఆ నగలు ప్రస్తుతం గరుడసేవలో వినియోగించకపోవడంతో ఆర్‌టీఐ ద్వారా వివరణ కోరగా అలాంటి ఆభరణాలు టీటీడీ వద్ద లేవని తెలిపినట్లు దాత ఆదినారాయణ తెలిపారు. తన నగలు మాయం చేసిన ఈవో, ఇప్పటి డీసీ ఏకాంబరంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై డిప్యూటీ కమిషనర్ ఏకాంబరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆదినారాయణ ఎలాంటి నగలు విరాళంగా స్వామివారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నకిలీ రశీదు సృష్టించి తనపై ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకో వాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
డబ్బులిస్తానని పిలిచి.. దోచేశారు
యాదమరి : తమిళనాడుకు చెందిన ఓ రియ ల్టర్ తనకు రూ.20 లక్షలు అవసరమని తన స్నేహితుడికి చెప్పగా ఇస్తానని నమ్మబలికాడు. తీరా వచ్చాక తాను అడిగింది ఇవ్వలేదు సరికదా ఆ రియల్టర్‌ను హింసించి తన ఫోన్ పే నుంచి రూ.2,33,000 దోచేశారు ఇద్దరు కేటుగాళ్లు.స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ వివరాలు మేరకు...తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ,సినీ నిర్మాతగా మారాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. అయితే చేస్తున్న వ్యాపారంలో ఆర్థిక ఒడిదొడుకులు రావడంతో తన స్నేహితుడైన తమిళనాడుకు చెందిన పరమేశ్వరన్‌కు ఫోన్ చేసి తనకు రూ.20 లక్షలు అప్పుగా కావాలని అడిగాడు. తనకు సహాయం చేస్తే 2 శాతం కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీంతో ఆ మొత్తాన్ని ఏర్పాటు చేస్తానని వెంటనే కుప్పం రావాలని చెప్పగా ..భాధితుడు ఈ నెల 16న బెంగళూరు నుంచి కుప్పం వచ్చారు. అక్కడి నుంచి చిత్తూరులోని ప్రశాంత్ నగర్ కు చెందిన పరమేశ్వరన్ స్నేహితుడు రాజ్ కుమార్ కారులో వెదుకుప్పం మండలం తెల్లగుండ్లపల్లి సమీపంలోని ఓ క్వారీ యజమాని వద్దకు తీసుకెళ్లారు.అక్కడ మణిరత్నంను కారులో బంధించి తీవ్రంగా గాయపరిచారు.ఆ సమయంలో అతడి ఫోన్ నుంచి రూ.2,33,000 నగదును పరమేశ్వరన్ తనకు తెలిసిన వారి నంబర్లకు బలవంతంగా బదిలీ చేయించారు. అనంతరం ఈనెల 18న యాదమరి మండలంలోని నుంజర్ల ప్రాజెక్టు వద్ద మణిరత్నంను హింసించి తమకు మరిన్ని డబ్బులు కావాలని వేధించసాగారు. మరుసటి రోజు చిత్తూరులో వారు టీ తాగుతున్న సమయంలో బాధితుడు వారి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితులు పరమేశ్వరన్, రాజ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి దర్యాపు చేస్తున్నారు.
నగలు మాయం అయ్యాయని ఆరోపిస్తున్న ఆదినారాయణ
నగలు ఇవ్వలేదని చెబుతున్న డీసీ ఏకాంబరం
ఆలయానికి ఇచ్చిన నగలు మాయం!