
దర్జాగా కబ్జా !
రూ. 10 కోట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణ
స్థానిక ఎమ్మెల్యే పీఏ నిర్వాకం
రాత్రికి రాత్రే సాగిన భవన నిర్మాణాలు
జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
అధికారులు పట్టించుకోకపోవడంతో
రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే
అక్రమ కట్టడాన్ని డైవర్ట్ చేస్తూ ఎస్‌ఐ ఓవర్ యాక్షన్
పలమనేరు : అఽధికారం ఉందనే అహంకారంతో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి పీఏ పార్థసారథి ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని దర్జాగా ఆక్రమించి రాత్రికే రాత్రే భారీ కట్టడాన్ని నిర్మించేశాడు. పేదలెవరైనా ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకుంటే తొలగించే అధికారులు దీనిపై అసలు నోరు మెదపడం లేదు. ఇదే అదునుగా భావించిన ఆ పీఏ ఇష్టానుసారంగా అక్రమ కట్టడాన్ని నిర్మించేశాడు. దీనిపై సాక్షి దినపత్రికలో పలు కథనాలు వచ్చినా అధికారులు చలించలేదు. జరుగుతున్న అన్యాయంపై కడుపు మండిన పలువురు పట్టణ వాసులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు లేవు. దీంతో ప్రజాబీష్టం మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి అక్రమ కట్టడాన్ని ఆపాలంటూ మంగళవారం రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు స్థానిక ఎస్‌ఐ హంగామా సృష్టించారు. ఎట్టకేలకు ఉన్నతాధికారుల హామీతో అక్కడ జరుగుతున్న పనులను ఆపేశారు.
గతంలో ఏమి జరిగిందంటే...
పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ప్రభుత్వ నీటి ట్యాంకు ఉంది. ఇందుకు సంబంధించిన గేట్‌వాల్వ్, పట్టణానికి నీటి సరఫరా ఇక్కడి నుంచే సాగుతోంది. దీనికి తోడు కాలువపల్లి వైఎస్సార్ జలాశయం నుంచి పట్టణానికి మంచి నీటి సరఫరా చేసే భారీపైప్‌లైను ఇక్కడే ఉంది. ఇక్కడి ప్రభుత్వ స్థలంలో గతంలో చిన్నపాటి గుడిసె ఉండేది. ఎలాగైనా ఈ స్థలాన్ని కబ్జా చేయాలని భావించిన పార్థసారథి అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో కలిసి ఆయనతో సన్నిహితంగా ఉంటూ వ్యక్తిగత సహాయకుడిగా మారాడు. ఆపై నన్ను ఎదిరించేవాళ్లెవరంటూ 2007లో ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ వారి ద్వారా పట్టా పొందాడు. ఆపై 2018లో మున్సిపల్ అధికారుల నుంచి ప్లాన్ అప్రూవల్ చేసుకొని ఆ స్థలానికి పన్నులు చెలిస్తూ వచ్చాడు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే ఆ స్థలంలో రహస్యంగా పిల్లర్లు వేసి భారీ భవన నిర్మాణానికి రంగం సిద్ధం చేశాడు. దీనిపై పలు అభ్యంతరాలు వస్తుండడంతో పగలు కాకుండా రాత్రులో మాత్రమే నిర్మాణాన్ని చేస్తూ ప్రస్తుతం గోడల దాకా నిర్మాణం చేపట్టారు.
ఆక్రమణలపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో..
పలమనేరు పట్టణంలో మెయిన్‌రోడ్డు పక్కన ఇంతటి భారీ అక్రమాలు జరుగుతుండడంతో కడుపు మండిన స్థానికులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ వారి నుంచి ఎలాంటి చర్యలు లేకుండా పోయాయి. దీంతో వారు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసి ఈ ఆక్రమణపై స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడకు తెలిపారు. దీంతో ఆయన అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి అక్రమ కట్టడం వద్దకెల్లి దీన్ని ఆపేయాలంటూ సూచించారు. స్పాట్ నుంచే మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఆర్‌డీవో భవానికి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ స్థలాన్ని సర్వే చేసి రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
విషయం పక్కదారి పట్టించేందుకు రెచ్చిపోయిన ఎస్‌ఐ
మాజీ ఎమ్మెల్యే అక్రమ కట్టడం వద్దకు వస్తున్నారని తెలిసి కూటమి నేతల ప్రమేయంతో పట్టణ ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి భారీ బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. రోడ్డు పక్కన కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి భారీ నిర్మాణం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదంటూ విమర్శించారు. ఉన్నతాధికారులకు ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇలా ఉండగా మధ్యలో కల్పించుకున్న ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి కావాలనే పోలీసులను అమర్యాదగా మాట్లాడుతావా అంటూ మాజీ ఎమ్మెల్యేను సైతం ఏకవచనంతో మాట్లాడారు. ఆ నాకొడుకు, ఈ నాకొడుకంటూ బండబూతులు అందుకున్నారు. ఎలాగైనా అక్రమ నిర్మాణ విషయాన్ని పక్కదోవ పట్టేలా ఆయన పథకం ప్రకారం హంగామా సృష్టించారు.
అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకపోతే..
అక్రమ నిర్మాణాలపై పత్రికల్లో వచ్చినా, ప్రజలు ఫిర్యాదు చేసినా కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే పీఏ అక్రమించుకొని అక్రమ కట్టడాన్ని నిర్మిస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదంటూ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ విమర్శించారు. అసలు ప్రభుత్వ స్థలానికి ఎలా పట్టా ఇచ్చారంటూ గట్టిగా మాట్లాడారు. మంచినీటి ట్యాంకు కోసం ప్రజా అవసరాల కోసం ఉంచిన స్థలాన్ని ఎలా ఆక్రమించుకున్నారంటూ వాదించారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించకపోతే తామే వైఎస్సార్‌సీపీ నాయకులతో వచ్చి అక్రమ కట్టడాన్ని తొలగిస్తామంటూ అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మురళీకృష్ణ, చెంగారెడ్డి, ముజ్జు, రెడ్డెప్పరెడ్డి, ఎస్టీ నాగరాజు తదితరులు ఉన్నారు.
చర్యలు తీసుకుంటాం
ఈ విషయమై స్థానిక టీపీఎస్ ఇందిరాను వివరణ కోరగా ఇదంతా గతంలో జరిగిందని తనకేమీ సంబంధం లేదన్నారు. కమిషనర్ రమణారెడ్డిని అడగ్గా సర్వేయర్ ద్వారా కొలిపించడం, ఈ స్థలం వెనుక పైప్‌లైన్ ఉందా లేదా అని చూడడం, ఆపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయమై స్థానిక తహసీల్దార్ ఇన్భునాథన్ మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ పొరంబోకు స్థలానికి పట్టా ఇచ్చారని దానిపై కోర్టులో కేసులు కూడా నడిచాయన్నారు. దీనికి మున్సిపల్ అధికారులు ఎలా అప్రూవల్ చేశారో తెలియదన్నారు. ఆక్రమణలపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.