
అక్రమార్కుల్లో దడ
అక్రమాలు బయటపడేనా !
కరువు ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించి వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తుంటే..రాష్ట్రంలో అధికారం మాదే..అడిగేదెవరు , అడ్డొచ్చేదెవరు..అంటూ పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధి పనుల్లో తమ్ముళ్లు నిధులను అడ్డంగా దోచేశారు. దీనిపై విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగుతుండడంతో అక్రమార్కుల్లో దడ మొదలైంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పుంగనూరు నియోజకవర్గంలో 2024–25లో రూ.65 కోట్లు ఉపాధి కోసం ఖర్చు చేసినట్టు లెక్కలు చూపి నిధులు బొక్కెశారు. దీనిపై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టి, నివేదికలు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీభవాని హర్ష ఈనెల 15న చిత్తూరు జిల్లా పీడీ డ్వామాకు ఆదేశాలు జారీ చేశారు. పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 28 మంది సభ్యులతో ఈనెల 21 నుంచి 23 వరకు పనుల అక్రమాలపై విచారణ చేపట్టి, నివేదికలు పంపాలని ఆదేశించారు. విజిలెన్స్ బృందానికి సంబంధిత రికార్డులను అందించాలని పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణకు రానుండడంతో ఉపాధి హామీ అధికారుల గుండెల్లో వణుకు పుడుతోంది. అధికార పార్టీకి తలొగ్గి , నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో పనులు చేపట్టారు. ప్రస్తుతం విజిలెన్స్ విచారణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని హడలి పోతున్నారు.
పాత పనులకు కొత్త మెరుగులు
ఉపాధి పథకంలో నియోజకవర్గంలోని ఓ ప్రధాన నాయకుడికి చెందిన రెండు మండలాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏ పంచాయతీలోనూ ఎన్నడూ ఖర్చు చేయని విధంగా ఒక్కో పంచాయతీలో ఖర్చు చేయడం విమర్శలకు దారి తీస్తోంది. పాత పనులను కూటమి నాయకులు యంత్రాలతో కొత్త మెరుగులు దిద్ది, ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వస్తున్నాయి. రొంపిచెర్ల మండలంలోని పెద్దగొట్టిగళ్లు పంచాయతీలో గతంలో వాటర్‌షెడ్ పథకం కింద చేసిన పనులకు ప్రస్తుతం ఉపాధిలో పెట్టి బిల్లులు చేసుకున్నారని విమర్శిస్తున్నారు. రొంపిచెర్ల మండలంలో 12 పంచాయతీలు ఉండగా అందులో 8 పంచాయతీల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అక్రమాలలో అందనంత ఎత్తుకు వెళ్లినట్లు సమాచారం. మండలంలోని గానుగచింతలో రూ.2.10 కోట్లు, రొంపిచెర్లలో రూ.1.62 కోట్లు, పెద్దగొట్టిగళ్లులో రూ.1.50 కోట్లు, సీహెచ్ రెడ్డిగారిపల్లిలో రూ.1.42 కోట్లు, మోటుమల్లెలో రూ.1.43 కోట్లు, చిచ్చిలివారిపల్లిలో రూ.1.29 కోట్లు, బోడిపాటివారిపల్లిలో రూ.1.20 కోట్లు , అలాగే పులిచెర్ల మండలం కావేటిగారిపల్లెలో రూ.1.54 కోట్లు, కల్లూరులో రూ.1.20 కోట్లు, సోమల మండలం నంజంపేటలో రూ.1.30 కోట్లు, కందూరులో కోటి రూపా యలు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు.
యంత్రాలతో పనులు
ఉపాధిహామీ పథకంలో పనులు చేపట్టాలంటే ముందుగా గ్రామీణ స్థాయిలో ప్రజలు కలసి పనిని ఎంపిక చేయాలి. లేబర్ బడ్జెట్ తయారు చేసి అందుకు అనుగుణంగా రైతులు, ప్రజలకు అనుగుణంగా అర్హతను బట్టి పనులను ఎంపిక చేయాలి. ఆ పనులను సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ తీర్మానం ఆమోదించాలి. ఆ పనులను మండల పరిషత్‌లో ఆమోదించాలి. ఈ పనులకు ఎస్టిమేట్లు వేసి పరిపాలన అనుమతులు కలెక్టర్ ద్వారా పొందాలి. తరువాత పనులను ప్రారంభించాల్సి ఉంది. కానీ కూటమి నాయకులు వీటికి తిలోదకాలు ఇచ్చి , ఏకపక్షంగా తమకు నచ్చిన వారికి పనులు కల్పిస్తూ , ఆ పనులను కూలీలతో చేయించకుండా యంత్రాలతో చేయిస్తూ ఉపాఽధి నిధులు దోచుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలను తన వారిచే చేయించుకునేందుకు టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి ఎంపీడీవోలకు పలు లేఖలు రాసి తనకు నచ్చిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకుని, పాత వారిని తొలగించారనే విమర్శలు ఉన్నాయి.

అక్రమార్కుల్లో దడ