
తల్లిఒడికి చేరకనే..
చౌడేపల్లె: పురిటిబిడ్డ తల్లి ఒడికి చేరకనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఆ కుటుంబంమంతా విషాదంలో మునిగిపోయింది. బాధిత కుటుంబీకుల కథనం.. చౌడేపల్లె టౌన్, కుమ్మరవీధికి చెందిన ప్రసాద్, కవిత దంపతులకు పైళ్లెన ఏడాదికి కుమార్తె జన్మించినది. అప్పటి నుంచి సంతానంలేదు. ఇటీవలే కవిత మరోసారి గర్భందాల్చింది. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించగా హైరిస్క్ కేసుగా చౌడేపల్లె వైద్యులు నిర్ధారించారు. అందుకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకున్నారు. నెలలు నిండడంతో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ప్రయివేటు వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ లేకపోగా అక్కడే విధుల్లో ఉన్న ఏఎన్‌ఎంకు హైరిస్క్ గర్భిణి కేసుగా తెలియజేసి అడ్మిట్ చేయించారు. డాక్టర్లు గర్భిణీని పట్టించుకోలేదు. నార్మల్ డెలివరీ చేయించాలని సమయం వృథా చేశారు. బిడ్డ సుమారు 3.75 కేజీల బరువు ఉండడంతో డెలివరీ కష్టతరంగా మారింది. సిబ్బంది అతికష్టం మీద శనివారం ఉదయం 10.10 గంటల మధ్య చిన్నపాటి సర్జరీ చేసి బిడ్డ బయటకు వచ్చేలా చర్యలు చేపట్టారు. అప్పటికే పురిటి బిడ్డ హార్ట్‌బీట్ ఆగిపోయింది. డాక్టర్ పరీక్షించి పురిటిబిడ్డ మృతి చెందినట్టు నిర్ధారించారు. తల్లిదండ్రులు బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని, హైరిస్క్ కేసు అని చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. శస్త్ర చికిత్సచేసి ఉంటే తమ బిడ్డ బతికేదన్నారు. కడుపుపై ఒత్తడంతోపాటు, బలవంతంగా బిడ్డ బయటకు వచ్చేలా చేయడంతోనే చనిపోయిందని ఆరోపించారు. ఈ మేరకు వైద్య సిబ్బందిపై మదనపల్లె టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, అలాగే ఇలాంటి ఘటనలు పునారావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. పురిబిడ్డను అశ్రునయనాల నడుమ చౌడేపల్లెలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.

తల్లిఒడికి చేరకనే..