
కోడికి కార్పొరేట్ అంతంతే!
జిల్లాలో జోరుగా కోళ్ల పెంపకం పెంపకందార్లను ముంచేస్తున్న కార్పొరేట్ కంపెనీలు కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 చెల్లిస్తున్న వైనం
కాణిపాకం: కార్పొరేట్ సంస్థల కారణంగా కోళ్ల పెంపకందారులు నష్టాల్లో మునిగిపోతున్నారు. కష్టపడి కోళ్లను పెంచితే కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 మాత్రమే చెల్లిస్తున్నారు. ఫలితంగా ఫౌల్ట్రీ రైతులు ఫల్టీకొడుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. దీంతోవారు రోడెక్కి.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ను లేవనెత్తారు.
కోళ్ల పెంపకం ఇలా...
జిల్లాలో లింగాపురం, నాటుకోళ్లు, లేయర్స్, బ్రాయిలర్స్ పెంపకం జరుగుతోంది. లింగాపురం, లేయర్స్, నాటుకోళ్లు పక్కన పెడితే బ్రాయిలర్స్ కోళ్ల పెంపకంపై వెయ్యి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంటిళ్లిపాదీ ఈ పెంపకంలో నిమగ్నమైపోతున్నారు. వీరి వద్ద సుమారుగా 7 లక్షల నుంచి 10 లక్షల కోళ్లు పెరుగుతున్నాయి. కొన్నేళ్ల కిందట హెచరీస్ ద్వారా ఫౌల్ట్రీ రైతులు కోడి పిల్లలను తెచ్చుకుని పెంచేవారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలే పిల్లలను ఇచ్చి.. ఫీడు, మెడిసిన్ ఇస్తున్నాయి. ఫౌల్ట్రీ రైతులు వాటిని 40 రోజుల పాటు పెంచితే... కిలోకి రూ.4.50 నుంచి రూ.6.50 వరకు ఇస్తున్నాయి. ఈ మొత్తం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.
అదనపు భారం
కోళ్ల పెంపకందారులు 10వేల కోళ్లను 40 రోజుల పాటు పెంచి పోషించాలంటే కార్పొరేట్ సంస్థలు ఇచ్చే ఫీడ్, మెడిసిన్ సరిపోవడం లేదని రైతుల వాదన. ఈ కారణంగా ఫౌల్ట్రీ రైతులపై అదనపు భారం పడుతోంది. తొలుత పిల్లలను ఉష్ణోగ్రతలో పెట్టేందుకు బొగ్గు 25 బ్యాగు(25కేజీ)లు అవసరమవుతోంది. ఒక బ్యాగును రూ.500 చొప్పున్న కొనుగోలు చేస్తున్నారు. మెడిసిన్ ఖర్చులు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతోంది. కరెంటు బిల్లు 40 రోజులకు గాను రూ.7 వేల నుంచి రూ.9వేల వరకు వస్తోంది. వరిపొట్టు సైతం డబ్బులిచ్చి కొనుగోలు చేయాల్సి వస్తోందని పెంపకందారులు వాపోతున్నారు.
ఏదీ లాభం
పెంపకందారులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కోడి పిల్లలను దింపే సమయంలో చెప్పే ధరకు, కోడి బలిసిన తర్వాత ఇచ్చే ధరకు పొంతన ఉండడం లేదని పెంపకందారులు వాపోతున్నారు. కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 వరకు ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు చనిపోయిన కోళ్లు, కాళ్లు దెబ్బ తిన్న కోళ్లను తమవైపే నెట్టేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇదేమని అడిగితే ఎఫ్‌సీఆర్, సీఎఫ్‌సీఆర్ పేరుతో బెదిరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేజీకి రూ.9 ఇవ్వాలని రోడెక్కుతున్నారు.