
ఎస్వీ వెటర్నరీలో జాతీయ సదస్సు ప్రారంభం
చంద్రగిరి: పశుపక్ష్యాదులకు అందించాల్సి మెరుగైన వైద్య సేవలు, శస్త్రచికిత్సల కోసం తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ తిలగర్ హాజరవ్వగా, ప్రత్యేక అతిథిగా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ జేవీ రమణ, ప్రొఫెసర్ ప్రతాబన్ పాల్గొన్నారు. ఎస్వీ వెటర్నరీ చికిత్స, టీచింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి 14 రాష్ట్రాల నుంచి 25 పశువైద్య కళాశాలలకు చెందిన 250 పశువైద్య విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ తిలగర్ మాట్లాడుతూ.. పశువైద్యంలో స్పెషలిలైజేషన్ చాలా అవసరమన్నారు. పశువైద్య విద్యార్థులు స్కిల్‌తో పాటు ఆధునిక టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వీసీ జేవీ రమణ మాట్లాడుతూ.. పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ పాత్ర చాలా ఉందని తెలిపారు. ప్రొఫెసర్ ప్రతాబన్ మాట్లాడుతూ.. శస్త్ర చికిత్స విభాగం, డయాగ్నోసిస్ విభాగం ప్రాముఖ్యత, వ్యాధి నిర్ధారణ విభాగాల పాత్ర చాలా అవసరమన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ వి. వైకుంఠరావు, పశు వైద్య కళాశాల, తిరుపతి అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ పి.జగపతి రామయ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ప్రొఫెసర్ వీరబ్రహ్మయ్య వ్యవహరించారు. అనంతరం పశువైద్య, శస్త్రచికిత్సలకు సంబంధించిన బుక్‌లెట్‌లను ఆవిష్కరించారు.

ఎస్వీ వెటర్నరీలో జాతీయ సదస్సు ప్రారంభం