
సమర్థ పాలనతోనే దేశాభివృద్ధి
ఏర్పేడు : సమర్థవంతమైన పాలనతోనే దేశాభివృద్ధి సుస్థిరంగా సాగుతుందని లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. బుధవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ‘ఇండియా రోడ్ అహెడ్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ, చట్ట పాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు వంటి సామూహిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఎందుకు అవసరమో వివరించారు. దేశంలో ప్రజాస్వామ్య విధానం, ఆర్థిక పరిణామం, సాంకేతిక విప్లవం కోసం నూతన ఆవిష్కరణల ఆవశ్యతకను విశదీకరించారు. సుస్థిర, సమ్మిళిత వృద్ధి సమాన అభివృద్ధిని నిర్ధారించేందుకు సమాజంలోని వివిధ వర్గాల మధ్య అంతరం తగ్గించేందుకు ఆవిష్కరణలు ఉపయోగపడతాయన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పరిశ్రమ వంటి రంగాలే ప్రధాన ఆర్థిక వ్యవస్థలని వెల్లడించారు. అనంతరం ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ పదేళ్ల ప్రస్థానం, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు.