
సమస్యలు గుర్తించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంక్‌లను తనిఖీ చేసి సమస్యల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల నివేదికలను సంబంధిత హెచ్‌వోడీలకు అందజేయాలన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.10 లక్షలు, వివిధ సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వసతి గృహాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.