
నూతన అయ్యోర్లతో చెడుగుడు!
గందరగోళంగా పోస్టింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఖాళీలే ప్రదర్శించకుండా ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ప్రభుత్వ ఆర్డర్‌కు అధిక సంఖ్యలో పోస్టులు బ్లాక్ చేసిన వైనం కూటమి తీరు పై దుమ్మెత్తిపోస్తున్న నూతన అయ్యోర్లు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం నూతన అయ్యోర్లతో చెడుగుడు ఆడుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి అభ్యర్థులకు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్, రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో నూతన అయ్యోర్లు ఉద్యోగాల్లో చేరకముందే నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తీవ్ర ఒత్తిడిని భరించలేక ఇటీవల జిల్లా కేంద్రంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఒక స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగమే వద్దు అంటూ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఉద్యోగాలు సాధించినప్పటికీ చాలా మంది పాల్గొనకపోవడం సైతం విమర్శలకు తావిస్తోంది.
ఖాళీలే ప్రదర్శించకుండా..
కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా ఉన్న పూర్తి ఖాళీలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే విద్యాశాఖ అధికారులు అలా చేయకుండా లోలోపలే కుట్రలకు పాల్పడి పలు పోస్టులను బ్లాక్ చేశారు. ఈ కుట్రలను ఉపాధ్యాయ సంఘ నేతలు ప్రశ్నిస్తారని పసిగట్టి సంఘ నాయకులకు కౌన్సెలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదని ప్రకటించారు.జరుగుతున్న అన్యాయాన్ని నూతన టీచర్లు ప్రశ్నించలేక మిన్నకుండిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కేటగిరీ 1, 2లో దాదాపు 500 పోస్టులను ప్రదర్శించకుండా బ్లాక్ చేశారు. 1:1 ప్రాతిపదికన తిరు, చిత్తూరు జిల్లాల్లో శిక్షణలకు హాజరైన నూతన టీచర్లు ఎంత మంది ఉన్నారో అనే ఖాళీలను ప్రదర్శించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
1,394 ఖాళీలు మాత్రమే
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,394 మందికి 1,394 ఖాళీలు మాత్రమే ప్రదర్శించి కౌన్సెలింగ్ నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. నూతన ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాల్లో నియమించేలా కుట్రలకు పాల్పడడంతో దుమారం చెలరేగింది. కనీసం ఖాళీలను కోరుకునే అవకాశం కల్పించలేదని నూతన అయ్యోర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నూతన టీచర్లందరికీ ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా తిరుపతి జిల్లా కేంద్రంలోని ఒక్కొక్క శిక్షణ కేంద్రంలో ఒక్కొక్కసారి కౌన్సెలింగ్ జరపడడంతో నూతన టీచర్లు పూర్తిగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నది మెగా డీఎస్సీ కాదు మాయా డీఎస్సీ అంటూ ఉద్యోగాలు పొందిన నూతన టీచర్లే వెల్లడించడం కొసమెరుపు.
కౌన్సెలింగ్‌లో
చూపించిన పోస్టులు
1,394
కౌన్సెలింగ్ గందరగోళం
ఉన్నతవిద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 9న చిత్తూరులోని శిక్షణ కేంద్రాల్లో వెబ్ కౌన్సిలింగ్, తిరుపతిలోని శిక్షణ కేంద్రాల్లో ఎస్జీటీలకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి నిర్వహించకుండా పూటకు ఒక నిర్ణయంతో గందరగోళం సృష్టించారు. మొదట్లో స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, ల్యాంగ్వేజ్ పండిట్ కేడర్లకు మ్యాన్యూవల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే వారందరికీ వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించి, ఎస్జీటీలకు మాత్రం మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఒక్కో నిర్ణయం తీసుకుని నూతన అయ్యోర్లకు చుక్కలు చూపించి గందరగోళానికి తెరలేపారు. చివరికి ఈ నెల 9న రాత్రి 7 గంటల సమయంలో తిరుపతి జిల్లా కేంద్రంలోని శిక్షణా కేంద్రాల్లో మ్యాన్యువల్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు.