
భావప్రకటనా స్వేచ్ఛ ఉందా లేదా..?
శ్రీరంగరాజపురం : అధికార పార్టీ ఎమ్మెల్యే, నాయకుల అరాచకం, దోపిడీపై వైఎస్సార్‌సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం నేరమా..? అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఇటీవల తమపై అనుచిత వాఖ్యలు చేశారని, వాటిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఉమ్మడి జిల్లా క్రియాశీలక కార్యదర్శి కుప్పయ్య విలేకరుల సమావేశం నిర్వహించారని తెలిపారు. అది పెద్ద నేరమైనట్టు పోలీసులు కుప్పయ్యని ఆదుపులోకి తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసు స్టేషన్‌కు చేరుకుని తాను మీడియాతో మాట్లాడినా అది నేరమైనట్టు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ ఉందా..లేదా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక పాకిస్థాన్, ఉత్తరకొరియా వంటి నిరంకుశత్వ దేశాల్లో ఉన్నామో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు, నాయకుడికి ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఏకాబరం కూర్చొని ఉంటే కారణం లేకుండా టీడీపీకి చెందిన కొంతమంది రౌడీ మూకలు దాడిచేసి గాయపరచడం బాధాకరమన్నారు.