
నేటి నుంచి బోధనేతర పనులు బహిష్కరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నుంచి బోధనేతర పనులను పూర్తిగా బహిష్కరిస్తామని ఫ్యాప్టో చైర్మన్ మణిగండన్, సెక్రటరీ మునీర్‌అహ్మద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు గురువారం డీఆర్‌వో మోహన్‌కుమార్, డీఈవో వరలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వల్ల బోధనా సమయం కుంటుపడుతోందన్నారు. టీచర్లకు బోధనపై ఆసక్తి తగ్గిపోయే విధంగా కూటమి ప్రభుత్వం బోధనేతర పనులు చెప్పడం దారుణమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ ఈ నెల 7న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించిన పోరుబాటలో బోధనేతరపనులు బహిష్కరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధాహ్న భోజన పథకానికి సంబంధించి మాత్రమే టీచర్లు పనులు చేపడుతారన్నారు. సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సమీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఫ్యాఫ్టో సంఘ నాయకులు చెంగల్‌రాయమందడి, మదన్‌మోహన్‌రెడ్డి, కిరణ్, జగదీష్, చిరంజీవి పాల్గొన్నారు.