
గుర్తింపు లేదా?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కరోనా వంటి విపత్తులను సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్న వైద్య వృత్తికి తగిన గుర్తింపు లేదని పీహెచ్‌సీ వైద్య సంఘ నాయకురాలు శిరీష అన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సమ్మెలో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నా.. పీహెచ్‌సీ వైద్యులకు పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. ఇక పీజీ కోటాను 10 శాతం తగ్గించడం దారుణమన్నారు. ఇలాగైతే పీహెచ్‌సీ వైద్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని గుర్తు చేశారు. పలుమార్లు దీనిపై రాష్ట్ర పాలకులకు విన్నమించినా ఎలాంటి మార్పులు లేవని వాపోయారు. వైద్యులు జానకీరావు, ఎల్లయ్య పాల్గొన్నారు.