
ఇసుక..దాచేయ్..దోచేయ్ !
చౌడేపల్లె : కూటమి నేతల అండదండలు.. ఏమి చేసినా అడిగేవారెవరున్నారు? దొరికినంతా దోచేయ్.. మాకు వాటా ఇచ్చేయ్.. అనే చందంగా చౌడేపల్లెలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. చౌడేపల్లె మండలంలో ఇసుక, ఎర్రమట్టి గ్రావెల్ దందా దర్జాగా ప్రభుత్వ స్థలాలు, గుట్టలు, చెరువుల్లో మట్టి, ఇసుకను కొల్లగొట్టి సొమ్ము చేసుకొంటున్నా అధికారులెవ్వరూ నోరెత్తకపోవడంతో పలు ఆరోపణలకు తావిస్తోంది. చౌడేపల్లె బోయకొండ మార్గంలోని చిన్నకొండామర్రి సమీపంలో ఓ వ్యాపారి ఏకంగా ఇసుక డంప్ చేసి వ్యాపారం చేస్తున్నా అధికారులు నోరు మెదపడంలేదు. పగలు గ్రామాల్లో ఇసుక అవసరమైన వారి నుంచి ఆర్డర్లు తీసుకొని లోడు ఇసుక రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. కందూరు అటవీ ప్రాంతాల్లోని వాగులో నుంచి జేసీబీల సాయంతో ఇసుక లోడ్‌చేసి వారికి అనుకూలమైన రహస్య ప్రాంతాలకు తరలించి ఇసుకను దోచేస్తున్నారు. రాత్రి పూట ఇక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రం సరిహద్దు ప్రాంతాలకు ఇసుక టిప్పర్లు రాత్రిపూటే రైట్ చెబుతూ కూటమి నేతలకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లోని మట్టిని ఒకే చోట డంప్ చేయడంతో పాటు ఇసుకతోపాటు అక్రమ వ్యాపారం సాగిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.