
గజరాజుల బీభత్సం
పులిచెర్ల (కల్లూరు) : మండలంలోని పాతపేట, చల్లావారిపల్లె, మతుకువారిపల్లె గ్రామాల్లో ఆదివారం తెల్లవారు జామున ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి ధ్వంసం చేశాయి. దీంతో రైతులకు భారీ నష్టం చేకూరింది. ఎన్నడూ లేని విధంగా ఆదివారం ఆయా గ్రామాల్లో ఎక్కువ మంది రైతుల పంటలు ధ్వంసం కావడంతో ఆవేదన చెందుతున్నారు. ఏనుగులు మామిడి, కొబ్బరి చెట్లను పెకిలించి వేశాయి. టమోటా పంటలను తొక్కి నాశనం చేశాయి. మామిడి తోపుల చుట్టూ ఉన్న ముళ్ల కూసాలను సైతం విరిచేశాయి. పది రోజులుగా ఆయా గ్రామాల్లోనే తిరుగుతూ రాత్రి పూట పంటలపై పడి ధ్వంసం చేస్తున్నాయి. తిష్ట వేసిన ఏనుగులు మండలాన్ని వదిలి పోవడంలేదు. దీంతో ఎక్కువ మంది రైతులు పంటలను సాగు చేయడమే మానేశారు. ఏనుగుల బెడద నుంచి అటవీశాఖ అధికారులు పంటలను కాపాడాలని కోరుతున్నారు.
16 నుంచి బోయకొండలో షాపులు అద్దెకు వేలం
చౌడేపల్లె : బోయకొండ గంగాపురంలో దేవస్థానానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో గల కింది అంతస్తులోని 85 షాపింగ్ రూములును 3 ఏళ్లపాటు అద్దెకు ఇవ్వడానికి మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వేలం పాటలతో పాటు సీల్డు టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కొండ కింద గల గెస్ట్‌హౌస్‌లో మూడు రోజుల పాటు వేలం పాటలు జరపనున్నామని, ఆసక్తిగల వ్యాపారులు షాపింగ్ రూములను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిగిలిన వివరాలకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.