పింఛన్‌ పెంపు..ఎప్పుడో చెప్పు? | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ పెంపు..ఎప్పుడో చెప్పు?

Sep 17 2025 7:29 AM | Updated on Sep 17 2025 8:03 AM

రొంపిచెర్ల: నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుడికి వికలత్వం 90 శాతం ఉన్నా ప్రభుత్వం రూ.6 వేలు మాత్రమే పింఛను ఇస్తోంది. రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందని రొంపిచెర్ల మండలానికి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొంపిచెర్ల మండలం, గానుగచింత గ్రామ పంచాయతీ, నగిరి దాసరిగుడెంకు చెందిన బాధితుల కథనం.. గ్రామానికి చెందిన కొరివి కుమారి కుమారుడు కె.గణేష్‌(10) పుట్టుకతోనే దివ్యాంగుడు. నడవలేని స్థితిలో ఉన్నాడు. అతనికి అన్నం పెట్టడానికి, చూసుకోవడానికి ఒకరు పక్కనే ఉండాల్సిందే. డాక్టర్లు కూడా బాలుడిని పరిశీలించి 90 శాతం వికలత్వం ఉన్నట్టు సర్టిఫికెట్‌ మంజూరు చేశారు. అయితే ఇతనికి పింఛను రూ.6 వేలు వస్తోంది. రూ.15 వేలు పెన్షన్‌ ఇచ్చి ఆదుకోవాలని మొరపెట్టుకున్నా ఎవ్వరూ కనికరించలేదు. ఆస్పత్రిలో చికిత్సల ఖర్చుకు కూడా చాలడం లేదని, తన భర్త నాలుగు నెలల క్రితం మృతి చెందాడని కుమారి బోరున విలపిస్తున్నారు. మందులు కావాలన్నా అప్పు చేయాల్సి వస్తోందన్నారు. ఇద్దరు ఆడ బిడ్డలు, ఒక కుమారుడు ఉండగా వారిలో ఒక కుమార్తెకు వివాహం చేశామని, మరో కుమార్తె కూడా దివ్యాంగురాలేనని తెలిపారు. ఇప్పుటికై న అధికారులు స్పందించి రూ.15వేల పెన్షన్‌ ఇప్పించాలని కోరారు.

పవిత్రోత్సవాలకు అంకురార్పణ

పుత్తూరు: అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాల అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్సం గ్రహణం, సేనాధిపతి ఉత్సవాన్ని మేళతాళాల మధ్య నిర్వహించారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయని, దోషాల నివృత్తితో ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాల్లో ఈనెల 17న బుధవారం తొలిరోజున పవిత్ర ప్రతిష్ట, 18న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు, చివరిరోజు 19న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన నిర్వహిస్తామని వెల్లడించారు. పవిత్సోవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం ఆలయ మహాగోపురం వద్ద వేదమంత్రోచ్ఛాణల మధ్యన అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్‌ దీపాలు, వివిధ పు ష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. కార్య క్రమాలను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

విమానాశ్రయంలో

యాత్రి సేవా దివస్‌

రేణిగుంట: ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న యాత్రి సేవా దివస్‌ కార్యక్రమాన్ని తిరుపతి విమానాశ్రయంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ బూమినాథన్‌ తెలిపారు. ఆయన మంగళవారం విమానాశ్రయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రయాణికులను స్వాగతించడం, ఎస్‌వీ మ్యూజిక్‌ స్కూల్‌ విద్యార్థులతో జానపద నృత్య కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్కృతితో ప్రయాణికులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు చేయడానికి వైద్య, రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనంగా, విమానాశ్రయంలో ఆటో టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విమానాశ్రయం ద్వారా ప్రయాణించే పిల్లలకు క్విజ్‌, పెయింటింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. విమానాశ్రయం లోని పరిస్థితులను వివరించేందుకు స్థానిక పాఠశాల విద్యార్థులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

పింఛన్‌ పెంపు..ఎప్పుడో చెప్పు? 
1
1/2

పింఛన్‌ పెంపు..ఎప్పుడో చెప్పు?

పింఛన్‌ పెంపు..ఎప్పుడో చెప్పు? 
2
2/2

పింఛన్‌ పెంపు..ఎప్పుడో చెప్పు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement