
పశువైద్యం..కడు దైన్యం
24 గంటల ఆస్పత్రికి స్వస్తి
ఒక్క డాక్టర్‌తోనే కాలయాపన
అవస్థల్లో పాడిరైతులు
జిల్లా పశు వైద్యశాల గాడితప్పింది. ఆస్పత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పలువురు ఆస్పత్రి అధికారులు, సిబ్బంది విధులకు ఢుమ్మా కొట్టడం రివాజుగా మారుతోంది. సమయపాలనకు స్వస్తి పలకడంతో తాళం పడుతోంది. ఒక్క డాక్టరే దిక్కుగా మారిన ఈ ఆస్పత్రి.. వైద్య సేవల విషయంలో మూగబోయింది. సమస్యలు ఏకరువు పెడుతున్నా ఏ ఒక్కరూ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్‌లో జిల్లా పశువైద్యశాల ఉంది. ఇక్కడికి నిత్యం 100కు పైగా ఓపీలు వస్తున్నాయి. పశువులతో పాటు మేకలు, గొర్రెలు, కోళ్లు, కుక్కలు, ఇతర పెంపుడు జంతువులను తీసుకొస్తుంటారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇక్కడకు వస్తున్నారు. చిత్తూరుతో పాటు బంగారుపాళ్యం, పూతలపట్టు, గుడిపాల, యాదమరి, తవణంపల్లి మండలాల నుంచి కూడా అధికంగా వస్తున్నారు. అయితే ఇక్కడ అత్యవసర వైద్యం ఆమాడదూరంలో నిలుస్తోంది. వైద్య బృందం ఉదయం ఆలస్యంగా రావడంతో పాటు సాయంత్రం 4.30 గంటలకే తాళం వేసి వెళ్లిపోతున్నారు. ఆపై వచ్చిన పాడి రైతులు, పెంపుడు జంతువులకు వైద్యం అందని ద్రాక్షగానే మారుతోంది. డాక్టరు లేరని ఇంటిబాట పడుతున్నారు. లేకుంటే ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇక ఒక్క డాక్టర్‌తోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఆ డాక్టర్ సెలవు పెడితే కాంపౌడరే ఈ వైద్యశాలను నడిపించాల్సిన దుస్థితి ఏర్పడింది. 24 గంటలు పనిచేయాల్సిన ఈ ఆస్పత్రి 8గంటలు మాత్రమే నడుస్తోంది. రోజుల తరబడి సెలవుల్లోకి వెళ్లిపోతున్నారు. జంతు ప్రియులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారు లు స్పందించి డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు పనిచేసేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
మృత్యువాత పడుతున్నాయి
మూగజీవులకు ఆస్పత్రిలో తాగునీటి సదుపాయం లేదు. పాడి రైతులకు సైతం సరైన సదుపాయాలు లేవు. రైతులు రాత్రి పూట బస చేసేందుకు వసతులు లేవు. ఆస్పత్రికి అత్యవసర చికిత్స కోసం వచ్చి పదుల సంఖ్యల్లో మూగజీవులు ఆస్పత్రి ఆవరణలోనే మృత్యువాతపడ్డాయి. ప్రధానంగా లక్షలాది రూపాయల విలువ చేసే ఆవులు చనిపోతున్నాయి. బతకదనే వాటిని కళేబరాలకు ఇచ్చి వెళ్లిపోతున్నట్లు పలువురు వాపోతున్నారు.
మందుల్లేవ్
సరైన వైద్యం అందక పోగా.. ఆస్పత్రిలో అత్యవసర మందులు కరువయ్యాయి. మూగజీవులకు జ్వరం, మేత మందులు, ప్రసవ మందులు, కుక్క కరిచిన మందులు మాత్రమే ఉన్నాయి. ఆవులకు కాల్షియం లోపం, పాస్పరస్, ఐరన్ లోపం తదితర మందులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పశువుకు వేసిన నీడిల్, సిరంజన్‌ను ఇతర వాటికి కూడా వాడేస్తున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత మందులు కూడా కనుమరుగవుతున్నాయి. ఈ తరుణంలో సిబ్బందికి, జంతు ప్రియులకు మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి.
జిల్లా పశువైద్య ఆస్పత్రిలో అస్తవ్యస్తం
సాయంత్రం ఐదు గంటలకే తాళాలు

పశువైద్యం..కడు దైన్యం