
పోటెత్తిన అర్జీలు
● కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్యలపై నమోదైన 332 అర్జీలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు పోటెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 332 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదైనట్లు కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్ వెల్లడించారు.
ఇళ్లను తొలగిస్తామంటున్నారు
తాము నివసిస్తున్న ఇళ్లను తొలగిస్తామంటున్నారు న్యాయం చేయాలంటూ పుంగనూరు మండలం మేలందొడ్డి పంచాయతీ గోపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర, శారదమ్మలు వాపోయారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో తమ సమస్యను విన్నవించుకున్నారు.
రేషన్‌షాపు తొలగించారు
ఎటువంటి ఫిర్యాదులు లేకున్నా తమ గ్రామంలోని రేషన్‌షాపును అన్యాయంగా తొలగించారని ఐరాల మండలం పుల్లూరు గ్రామానికి చెందిన దామోదరరెడ్డి, రంగయ్య తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ రేషన్‌షాపును తొలగించి పి.ఒడ్డుపల్లిలోని ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో రేషన్ పంపిణీ చేస్తున్నారన్నారు. దీంతో రేషన్‌కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
ఆర్‌ఎంపీపై చర్యలు తీసుకోవాలి
వైద్యం వికటించేలా చికిత్స చేసిన ఆర్‌ఎంపీ వైద్యునిపై చర్యలు తీసుకోవాలని పలమనేరు మండలం కొలమాసనపల్లి వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవల కల్పన అనే మహిళకు ఆర్‌ఎంపీ చేసిన వైద్యం వికటించిందన్నారు. దీంతో ఆమెకు ప్రస్తుతం మాటలు రావడం లేదని వాపోయారు. అమాయక ప్రజలకు వికటించే వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు.
ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు జీతం చెల్లించాలి
జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు 13 నెలల పెండింగ్ జీతం వెంటనే చెల్లించాలని ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు పాల్గొన్నారు.

పోటెత్తిన అర్జీలు