
జగనన్న పర్యటన విజయవంతం చేయండి
పెనుమూరు(కార్వేటినగరం): మామిడి రైతుల కష్టాలపై పోరాటం చేయడానికి బంగారుపాళేనికి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముక్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం పెనుమూరు మండలంలోని పులిగుండు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసి, మామిడి రైతుల పక్షాన నిలిచి, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పోరాటం చేయడానికి జగనన్న జిల్లాలో అడుగు పెడుతున్నారన్నారు. గతంలో కూడా పొగాకు, మిర్చి రైతుల పక్షాన పోరాటం చేసి, వారికి ఊరట కల్పించారని, అదే దిశలో జిలాల్లో మామిడి రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఈ నెల 9వ తేదీ బంగారుపాళేనికి వస్తున్నారని, ఆయన పర్యటనకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ముఖ్యంగా మామిడి రైతులు అత్యధికంగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం కనీస మద్దతు ధర టన్నుకు రూ.20 వేలు అందించి మామిడి రైతులను ఆదుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జగనన్న ప్రభుత్వంలో రైతులకు జరిగిన మేలును గుర్తు చేశారు. రైతన్నలకు ఎక్కడ అన్యాయం జరిగినా జగనన్న అక్కడ రైతుల పక్షాన పోరాటం చేసి, రైతుల పక్షపాతిగా నిలుస్తున్నారన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు అర్బన్: ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులకు ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్‌క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 54 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి