
నిందితుడికి మూడేళ్ల జైలు
చిత్తూరు అర్బన్: బాలికల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం స్థానిక జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి శంకరరావు తీర్పునిచ్చారు. ప్రత్యేక పీపీ మోహనకుమారి కథనం మేరకు వివరాలిలా.. మదనపల్లెకు చెందిన చంద్రశేఖర్(52) చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో మదనపల్లె బాలికోన్నత పాఠశాల వద్దకెళ్లి.. పిల్లల పట్ల అసభ్యకరంగా వ్యవహరించేవాడు. దీనిపై 2017లో పాఠశాల హెచ్‌ఎం పద్మజ మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చంద్రశేఖర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి మూడేళ్లు జైలు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఎన్‌ఐఏబీతో వెటర్నరీ వర్సిటీ ఒప్పందం
తిరుపతి సిటీ : హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)తో ఎస్వీ వెటర్నరీ వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం వర్సిటీలో జరిగిన ఒప్పందంపై వీసీ ప్రొఫెసర్ రమణ, ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారు శర్మ సంతకాలు చేసి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. జంతు సంరక్షణ, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్‌ఐఏబీ సంస్థతో వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రధానంగా నాణ్యమైన విద్య, నూతన పరిశోధనలు, విద్యా మార్పిడి వంటి విషయాలపై సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడమే ఎంఓయూ లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, డీన్, అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి గ్రాప్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి బైరాగిపట్టెడలోని గిరిజన భవన్‌లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గ్రాప్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నారు. రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అండర్–11, 13, 15, 17 కేటగిరిలో బాల బాలికలకు నిర్వహించనున్న ఈ పోటీలను శనివారం ప్రారంభించనున్నారు. ఆ మేరకు రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏజి.రేఖారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, ఆయా విభాగాల్లో గెలుపొందిన బాల బాలికలు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్‌ఘడ్ రాష్ట్రం, బిలాస్‌పూర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని పేర్కొన్నారు.
తిరుమలకు వెళ్లి వచ్చేసరికే ఇల్లు గుల్ల
5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ
చిల్లకూరు : తిరుమలలో జరిగే గరుడ సేవకు కుటుంబ సభ్యులు వెళ్లి వచ్చేసరికే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి దూరి 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన నల్లయగారిపాళెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని నల్లాయగారిపాళెం గ్రామానికి చెందిన మస్తానయ్య గురువారం తిరుమలకు వెళ్లారు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసిన పక్కనే ఉన్న బంధువులు గమనించి తిరుమలలోని మస్తానయ్యకు దొంగతనం జరిగినట్లు సమాచారం అందించారు. దీంతో ఆయన ఫోన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ కిశోర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌బాబుతో పాటు క్లూస్ టీం చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.