
‘విత్తు’కోని ఆశలు
● వర్షాభావంతో అదును దాటుతున్న వైనం ● ఈ దఫా భారీగా తగ్గనున్న వేరుశనగ సాగు విస్తీర్ణం
జిల్లా వేరుశనగ సాగు వివరాలు
సాధరణ సాగు విస్తీర్ణం : 35,228 హెక్టార్లు
ఖరీఫ్‌లో పంటను
సాగు చేసే రైతులు : 90 వేల మంది దాకా
అవసరమైన విత్తనకాయలు : 50 వేల క్వింటాళ్లు
కూటమి ప్రభుత్వంలో అందినవి : 39 వేల క్వింటాళ్లు
ఇప్పటిదాకా సాగైన
వేరుశనగ విస్తీర్ణం : 300 హెక్టార్లు
పలమనేరు: వేరుశనగ రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. సాధారణంగా జూలై తొలి వారానికల్లా ఇక్కడ వేరుశనగ విత్తనాలేసే పనులు పూర్తికావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటిదాకా వరుణుడు కరుణించకపోవడంతో చేలల్లో విత్తనాలు పడలేదు. ఎక్కడో వెతికినా దొరకనట్టు ఓ శాతం మాత్రం వేసిన విత్తనాలు మొలకెత్తినా అవీ వర్షం లేక మాడిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ దఫా జిల్లాలో వేరుశనగ సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉంది.
ఆశలే వదేలుకోవాల్సిందేనా?
పదేళ్ల క్రితం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.2 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాధారణ సాగుగా ఉండేది. ఏటా పంటసాగు తగ్గుతూ వస్తోంది. జిల్లా విభజన జరిగాక పంట సాధారణ సాగు 55 వేల హెక్టార్లకు పడిపోయింది. ప్రస్తుతం సాధారణ సాగు 35 వేల హెక్టార్లకు దిగజారిపోయింది. ఈ దఫా సకాలంలో వానలు పడుంటే పంట సాగు 20వేల హెక్టార్లు దాకా ఉండొచ్చునని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ సీజన్ ముగుస్తున్నా వరుణుడు కరుణించ లేదు. ఈ దఫా వేరుశనగ పంటపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనన్న మాటలు వినిపిస్తున్నాయి.
సాగుచేసినా నష్టాలు తప్పవా?
గత కొన్నేళ్లుగా వేరుశనగను రైతులు సాగుచేయడం తగ్గించారు. ఇందుకు ప్రధాన కారణం పంటకు పెట్టిన పెట్టుబడి సైతం దక్కడం లేదు. సకాలంలో వర్షాలు రాకపోవడం, లేదా ఎక్కువగా వర్షాలు పడి పంటకు నష్టం జరుగుతుండడంతో రైతులు వేరుశనగ సాగుపై ఆశలు వదులుకుంటున్నారు. పంట దిగుబడులు సైతం ఎకరానికి నాలుగైదు బస్తాలు కూడా కావడం లేదు. ఎకరా పొలంలో పంట సాగుకు రూ.15వేల దాకా అయితే దిగుబడి 5వేలు కూడా రావడం లేదు. దీంతో రైతులు వేరుశనగ పంటపై ఆసక్తిని చూపడం లేదని తెలుస్తోంది. బస్తా (30కేజీలకు) రూ.1116 సబ్సిడీగా వస్తుందని చాలామంది రైతులు విత్తనాలను తీసుకున్నారు. కానీ వర్షాలు లేక సీజన్ ముగుస్తుండడంతో వీటిని అమ్ముకోవడం .. లేదా ఇళ్లకు వాడుకోవడం చేసుకోవాల్సిందే.
విత్తనాలే ఇవ్వలేదు
విత్తనాలేసేందుకు వానలేదు. సరే కనీసం విత్తనాలను సైతం ఇవ్వలేదు. మాకు కొంగోళ్లపల్లి, మామొడుగు గ్రామాల్లో ఆరెకరాల భూములున్నాయి. రెండుచోట్ల రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలడిగినా లేవని చెప్పారు. వచ్చిన విత్తనాలను ఎవరు తీసుకున్నారో దేవుడికే తెలియాలి.
– నాగరాజరెడ్డి, రైతు, కొంగోళ్లపల్లి,
గంగవరం మండలం
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం
మరో వారం రోజుల దాకా విత్తనాలేసేందుకు సీజన్ ఉంది. అప్పటిదాకా వర్షం పడకుంటే ఆపై ఏమీచేయను కాదు. అందుకే ప్రత్యామ్నాయంగా వేరుశనగ పొలాల్లో ఉలవ సాగుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. పలమనేరు డివిజన్‌కు మాత్రమే 80 వేల క్వింటాళ్ల ఉలవ విత్తనాలకు ఇండెంట్ చేశాం. జిల్లాలో ఎక్కడా వర్షాలు లేవు. వేరుశనగ సాగు భారీగా తగ్గే అవకాశం ఉంది.
– గీతాకుమారి, వ్యవసాయశాఖ
సహాయ సంచాలకులు, పలమనేరు
ఈ దఫా సీజన్ పోయినట్టే!
సాధారణంగా వేరుశనగ విత్తనాలకు జూన్ 15 నుంచి జూలై తొలివారంలోగా చేలల్లో వేయాలి. ఈ సీజన్‌లో వేస్తేనే పంట దిగుబడి వస్తుంది. ఇప్పటిదాకా వర్షాలు పడలేదు. దీంతో 90 శాతంపైగా చేలు బీళ్లుగానే ఉన్నాయి. పది శాతం మంది రైతులు వేసవి దక్కులు చేసుకున్నా విత్తనాలేసేందుకు అవకాశం లేకుండా పోయింది. సిద్ధం చేసుకున్న విత్తనాలు వర్షం కోసం ఎదరుచూస్తున్నాయి.

‘విత్తు’కోని ఆశలు

‘విత్తు’కోని ఆశలు

‘విత్తు’కోని ఆశలు