● దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ చలువతో వేదిక్ వర్సిటీ
● నేడు వేదిక్ వర్సిటీ 20వ వ్యవస్థాపక దినోత్సవం
తిరుపతి సిటీ : వేద విద్యను విస్తృతం చేసి వేదాల సారాంశాన్ని, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో వేద విద్యకు ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచించారు. ఇందులో భాగంగా 2006లో టీటీడీ ఆధ్వర్యంలో వేద పండితులు, పీఠాధిపతులు సలహాలతో అలిపిరి జూపార్క్ రోడ్డు సమీపంలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
19 విభాగాలలో..
వర్సిటీ ఏర్పాటు చేసిన తొలి ఏడాది నుంచి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేద విద్యను అభ్యసించేందుకు వందల సంఖ్యలో విద్యార్థులు వేదిక్ వర్సిటీలో అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం సుమారు 19 విభాగాలలో వర్సిటీ వేద విద్యను అందిస్తోంది. వేద విభాగంలో రుగ్వేద, కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం, ఆగమ శాస్త్ర విభాగాలలో వైఖానస, పంచరత్ర, శైవాగమం, పౌరోహిత్యం విభాగాలలో ఆశ్వాలయన, అపస్తంభ, పరస్కర, వేద భాష్యంలోని 5 విభాగాలలో, కల్ప, మీమాంస విభాగాలలో 15 చొప్పున అడ్మిషన్లు చేపట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులలో ప్రతి ఏడాది ఒక్కో విభాగంలో ప్రత్యేక నిపుణులైన వేద పండితులతో శిక్షణ ఇస్తున్నారు. సంస్కృత పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు ఏడు విభాగాలలో సర్టిఫికెట్ కోర్సులను సైతం వర్సిటీలో అందుబాటులో ఉంచారు.
ఉపాధి కల్పనే లక్ష్యంగా అడుగులు
వేదిక్ వర్సిటీలో విద్యనభ్యసించి పీజీ, యూజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులకు వంద శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. దేశ, విదేశాలలోని పలు ఆలయాలలో పండితులు, పూజారులుగా, సలహాదారులుగా వందల మంది వర్సిటీ విద్యార్థులు ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. టీటీడీ విద్యాసంస్థలలో అధ్యాపకులుగా, ఆలయాలలో పండితులుగా రాణిస్తున్నారు. అలాగే అయోధ్యలోని రామాలయంలో సైతం వేదిక్ వర్సిటీ విద్యార్థులు ఉన్నత స్థానాలలో పనిచేస్తుండటం వర్సిటీకి గర్వకారణంగా చెప్పవచ్చు.
నేడు వర్సిటీ 20వ వ్యవస్థాపక వేడుకలు
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి 20 ఏళ్లు నిండిన సందర్భంగా శనివారం వర్సిటీలోని సంధ్యావందన శాలలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. వీసీ రాణి సదాశివమూర్తి అధ్యక్షతన రిజిస్ట్రార్ భాస్కరుడు పర్యవేక్షణలో నిర్వహించనున్న వ్యవస్థాపక దినోత్సవానికి టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు హాజరుకానున్నారు.