
రేట్లు పెంచాలి
చిత్తూరు కలెక్టరేట్ : మధ్యాహ్న భోజన పథకం రేట్లు పెంచాలని వైఎస్సార్‌టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి కేంద్రం రూ.5.45 చొప్పున మధ్యాహ్న భోజన ధరలను నిర్ణయించిందన్నారు. అయితే ఆ నగదుకు అధనంగా రాష్ట్ర ప్రభుత్వం కుకింగ్ కాస్ట్ గా రూ.0.43ను మంజూరు చేస్తూ మొత్తం రూ.5.88గా నిర్ణయించినట్టు తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కేంద్రం రూ.8.17 నిర్ణయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అధనంగా రూ.40 పైసలు మొత్తం రూ.8.57 గా నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో రూ.6.19, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.9.26 చొప్పున కేంద్రం పెంచిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కేంద్రం పెంచిన ఉత్తర్వులను అమలు చేయకుండా మీనామేషాలు లెక్కిస్తోందన్నారు. పెరిగిన కుకింగ్ కాస్ట్‌ను అమలు చేయకుండా పాతరేట్లు అమలు చేయడం తగదన్నారు. వెంటనే కొత్త ఎండీఎం రేట్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భోజనం తయారీ కార్మికులకు కనీస వేతనంగా రూ.5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రేపు విశ్వంలో
ఉచిత అవగాహన సదస్సు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం విద్యాసంస్థలో ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి అవగాహన సదస్సును ఉచితంగా నిర్వహించనున్నారు. ఆ మేరకు విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు 4 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
14న కేంద్ర బృందం రాక
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో టీబీ ముక్తభారత్ అభియాన్ కార్యక్రమ అమలుపై సోమవారం కేంద్ర బృందం అధికారి భవాన్‌సింగ్ పర్యటించనున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఉదయం 9గంటలకు ఆయన జిల్లాకు చేరుకోనున్నారన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో టీబీ ముక్తభారత్ కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. అలాగే టీబీ సెంటర్లను పరిశీలించనున్నట్టు వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి
20 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 63,473 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది.