
లైంగిక దాడికి యత్నం
చౌడేపల్లె : ఇల్లు కట్టించడంతో పాటు అన్నీ తానై చూసుకుంటానని అసభ్యకరంగా మాట్లాడుతూ.. లైంగిక దాడికి యత్నించాడని కాగతి పంచాయతీ పలగార్లపల్లెకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదంటూ ఆదివారం ఆమె కన్నీటి పర్యంతమైంది. బాధితురాలి కథనం.. పలగార్లపల్లెకు చెందిన గంగరాజుకు ప్రాజెక్టు సమీపంలోని ఊదరకుంట వద్ద వ్యవసాయ పొలం ఉంది. ఈనెల 11వ తేదీనా ఆమె తన భర్త గంగరాజు పొలం వద్ద ఉండగా మధ్యాహ్నం అన్నం తీసుకొని బయలు దేరగా మార్గ మధ్యలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. లైంగిక దాడికి యత్నించగా కేకలు వేయడంతో పరారైనట్లు పేర్కొంది. ఈ ఘటనపై అదే రోజు రాత్రి వెళ్లి అడగ్గా తన అనుచరులతో కలిసి శ్రీనివాసులు తనతో పాటు తన భర్త కుటుంబీకులపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. ఈనెల 12 వతేదీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు.
ఆర్థిక కారణాలతో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు అర్బన్ : కుటుంబ ఆర్థిక కారణాలు వేధించడంతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్ పోలీసుల కథథనం మేరకు చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన ఇన్భనాథన్(58) శనివారం సాయంత్రం కుటుంబీకులకు గిరింపేట వరకు వాకింగ్ వెళుతున్నాని చెప్పాడు. తీరా క్రిష్ణవేణి కళాశాల ప్రాంతంలో పురుగుమందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. కాగా భార్య షీలా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆర్థిక కారణాలతో మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
లారీ బీభత్సం – మామిడిచెట్లు ధ్వంసం
గుడిపాల : రోడ్డుపైన వెళ్తూ ఓ లారీ అదుపు తప్పడంతో వ్యవసాయ పొలంలోకి వెళ్లి పొలం పక్కన ఉన్న రాతి కూసాలను ఢీకొంటూ మామిడి చెట్లను ధ్వంసం చేసింది. బెంగుళూరు నుంచి తమిళనాడులోని నామక్కల్‌కు వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం తాగి మద్రాస్ క్రాస్ రోడ్డు వద్ద జ్యోతీశ్వర్‌రెడ్డికి చెందిన రైతు మామిడితోటలోకి లారీని వదిలేశాడు. ఎదురుగా ఎవ్వరూ రాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో వ్యవసాయ పొలంలోకి ప్రవేశించి రాతి కూసాలు ధ్వంసం కావడంతో పాటు మామిడిచెట్లు ధ్వంసం అయ్యాయి.