
కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం
● టైరు పేలి కారు బోల్తా ● ప్రాణాలతో బయటపడిన కుటుంబ సభ్యులు
బంగారుపాళెం : మండలంలోని పాలేరు ఫ్లై ఓవర్ సమీపం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు టైరు పగిలి బోల్తా పడి దగ్ధమైంది. ఈ సంఘటనలో కాంచీపురానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు గాయాలతో బయటపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన తాండవమూర్తి (65)కి బైరెడ్డిపల్లె మండలంలోని విరుపాక్షపురంలోని ఆయుర్వేద వైద్యశాలలో నాటు మందు తాగించుకుని వచ్చేందుకు కుమారుడు కార్తికేయన్(34), తల్లి సంపత్‌కుమారి(60), భార్య అశ్వని(32), కుమారై రక్షిత(2), మామ వేలాయుధం(45) మొత్తం ఆరుగురు కలిసి ఉదయం 4.45 గంటలకు కాంచీపురం నుంచి తమ సొంత కారులో బయలుదేరి విరుపాక్షపురానికి 8 గంటలకు చేరుకున్నారు. అక్కడ తాండవమూర్తికి నాటుమందు తాగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో బంగారుపాళెం మండలం పాలేరు ఫ్లై ఓవర్‌కు కొంతదూరం వెళ్లిన తరువాత కారు టైరు పగిలి అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. కారుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. కారులో ఉన్న వారు డోర్ తెరుచుకుని దూకేసి ప్రాణాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న ఽకార్తీకేయన్, అతడి భార్య అశ్వనికి, మామ వేలాయుదానికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు మంటలను అదుపు చేసేందుకు కోసం పలమనేరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం అధికారి రెడ్డెప్పరెడ్డి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేలోగా కారు పూర్తిగా కాలిపోయింది. గాయపడిన వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తప్పిన ప్రాణాపాయం
కారు టైరు ఉన్న ఫలంగా పగిలిపోవడంతో అదుపుతప్పి కారు బోల్తాపడి మంటలు చెలరేగాయని అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. కారులో ఉన్నవారు తేరుకుని డోర్లు తెరుచుకుని బయటకు వచ్చారని తెలిపారు. కొంతసేపటికే కారు పూర్తిగా దగ్ధమైందన్నారు. కారు డోర్లు తెరుచుకోకపోయి ఉంటే కారులోని వారు చనిపోయి ఉంటారన్నారు.