
‘రూసా’ పనులు వేగవంతం చేయాలి
తిరుపతి సిటీ : రుసా ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్న పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రుసా) పథకం కింద జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని అంచనా వేయడానికి ఎస్వీయూలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం వర్సిటీ వీసీ ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్‌రావు హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీలో మౌలిక సదుపాయాలు, విద్యా, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా వీసీ అప్పారావు వర్సిటీలో రూసా పథకం కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. అనంతరం రూసా కోర్డినేటర్ ప్రొఫెసర్ రమశ్రీ వర్సిటీలో జరిగే పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్‌లు, రుసా సీఈఓ, ఆర్థిక, అభివృద్ధి విభాగాల కీలక అధికారులు పాల్గొన్నారు.