
దోపిడీ ఖాయం
మాట మాయం..
మామిడి రైతుల ఏడాది శ్రమ ఆవిరైంది. గిట్టుబాటు దక్కకుండా పోయింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు.. మంత్రులు మామిడి ధరపై ఇచ్చిన మాట మాయమైంది. ఫల్ప్ ఫ్యాక్టరీల
యాజమాన్యాలు తాము చెప్పిందే వేదంగా ఇష్టమొచ్చిన రీతిలో ధర నిర్ణయిస్తున్నాయి.. ఆ ధరకే ఇష్టపడి విక్రయిస్తున్నట్లు పుడమి పుత్రుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని, వారి శ్రమను దోపిడీ చేస్తున్నాయి. వెరసి కూటమి పెద్దల మామిడి మాట మాయం కాగా.. దోపిడీ ఖాయం అయ్యింది.
గుడిపాల వద్ద క్యూకట్టిన ట్రాక్టర్లు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడి మాట మటాష్ అయింది. తోతాపురి కిలో రూ.8 మద్దతు ధర మాయమైంది. కొన్ని ఫ్యాక్టరీలు కిలో రూ.5, రూ.6 అని తేల్చాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు ధరలను నొక్కిపెడుతున్నాయి. ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి మద్ధతు ధర ఆదేశాలు ఆమడదూరంలో నిలిచాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనతో కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టుకుంది. మామిడి రేట్లను కప్పిపుచ్చేందుకు కుయుక్తులు పన్నుతోంది. దీంతో మామిడి రైతులు కుదేలవుతున్నారు.
కొనుగోలిలా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 ఫ్యాక్టరీలుండగా 31 ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 38,706 మంది రైతుల నుంచి 2.22 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను కొనుగోలు చేశాయి. ఇంకా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు తోటల్లోనే ఉన్నాయి. మామిడి పోరుతో ఈసారి తోతాపురి కొనుగోలు మందగించాయి. దీంతో కాయలు చాలా వరకు రాలిపోతున్నాయి. రైతులు కూలీలకు కోత కూలి ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. ఫ్యాక్టరీలకు విక్రయించలేని పరిస్థితి నెలకొనిచ రైతులను నట్టేట మునుగుతున్నారు.
ఇదీ మంత్రుల ధర...
మామిడి కోతలకు ముందు ఎదురైనా సమస్యల కారణంగా కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో ధర రూ.8కు ఫ్యాక్టరీలు కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహక నిధిగా కిలోకు రూ.4 చొప్పున్న అందిస్తుందని ప్రకటించింది. తీరా ఫ్యాక్టరీ రేటు అమలుకు నోచుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి అచ్చెంనాయుడు గత నెలలో జిల్లాలో పర్యటించారు. గుడిపాల మండలం గొల్లమడుగులోని ఫ్యాక్టరీని తనిఖీ చేసి, తోతాపురి కిలో రూ.8కు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు నగరం ఎంఎల్‌ఎస్ పాయింట్ ఆవరణలో జరిగిన రైతులు, ఫ్యాక్టరీల ముఖాముఖి కార్యక్రమంలో ప్రతి ఫ్యాక్టరీలోనూ కేజీ రూ.8కు కొంటారని తెలిపారు. తీరా ఆ ధరలు ఆ మరుసటి రోజు నుంచే అమలు కాలేదు. ఫ్యాక్టరీలు రూ.6, రూ.5 రూ.4 అంటూ పాట పాడాయి. తర్వాత ధరల విషయంలో ఫ్యాక్టరీలు నోరెత్తకుండా చాలించుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 3,4 తేదీల్లో కుప్పంలో పర్యటించిన సందర్భంగా మామిడి రైతులు, ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడారు. కచ్చితంగా తోతాపురి కేజీకి రూ.8కు ఇస్తారని గట్టిగా ప్రకటించారు. తీరా ఆ మాటలను కూడా ఫ్యాక్టరీలు లెక్క చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
4,99,274 మెట్రిక్ టన్నుల దిగుబడి
జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి పంట పండుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లకుగాను 4,99,274 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని ఉద్యానశాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. జూన్ నెల ఆరంభం నుంచే కోతలు ప్రారంభమయ్యాయి. ఫ్యాక్టరీలు జూన్ 6వ తేదీ నుంచి ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు ప్రారంభించాయి. ర్యాంపులు జూన్ మూడో వారం నుంచి కొనుగోలుకు ముందుకు వచ్చాయి.
తోతాపురి కిలో రూ.8కే కొంటారన్న సీఎం చంద్రబాబు
జీడీనెల్లూరు ఫ్యాక్టరీలో రూ.6 విక్రయిస్తున్నట్లు రైతుల నుంచి అంగీకారపత్రం
పూతలపట్టులో రూ. 5 లెక్కన జమ
పలు ఫ్యాక్టరీల్లో ధరలపై నోరు విప్పని ఫ్యాక్టరీ నిర్వాహకులు
మామిడి రేట్లను కప్పి పుచ్చేందుకు కూటమి కుయుక్తులు
మూగబోయిన మామిడి రైతులు
రేటు చెబితే ఒట్టు..
దిగుబడిని సాకుచూపి మా పొట్టకొడుతున్నారు. ఎంతకు కొంటున్నారో చెప్పడం లేదు. మేము పండించిన పంటకు వారు చెప్పిందే ధరగా మారింది. ఈ పంట ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే. కొన్ని ఫ్యాక్టరీలు రూ.5, రూ.6 అని చెబుతున్నాయి. 5 ఎకరాలో పంట పండింది. రూ.లక్షల్లో ఖర్చు చేశాను. ఆ కాయలను అమ్మితే చేతికి ఏం మిగలదు. ఫ్యాక్టరీల వద్దకు కాయలు తోలుకొస్తే సిఫార్సులతోనే గడిచిపోతోంది. –మురళి, యాదమరి మండలం

దోపిడీ ఖాయం