
సంక్షేమ సంతకాలు
తిరుపతిలో వర్సిటీ
సత్యవేడులో శ్రీసిటీ
నగరిలో పలు అభివృద్ధి పనులు
నేడు వైఎస్సార్ జయంతి
చిత్తూరు కార్పొరేషన్: పేదల గుండెల్లో కొలువైన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను ఇప్పటికీ ఉమ్మడి జిల్లా వాసులు నెమరువేసుకుంటూనే ఉన్నారు. రాజశేఖరరెడ్డి జిల్లాకు చేసిన మంచి, జనం హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
గాలేరు–నగరి సుజల స్రవంతికి శ్రీకారం
కరవు ప్రాంతమైన చిత్తూరు జిల్లాకు శ్రీశైలం జలాశయం నుంచి వరదజలాల్లో మిగులు నీటిని తరలించి సాగు, తాగు నీరు అందించడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని 2005లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని 1,03,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి, ఈ జిల్లాలోని ప్రజలకు తాగునీరు అందించడానికి ఈ పథకానికి రూపకల్పన చేశారు. 430 కిలోమీటర్లు సాగే ఈ ప్రాజెక్టు కాలువ 254వ కిలోమీటరు వద్ద అప్పటి ఉమ్మడి జిల్లాకు ప్రవేశించేలా ఏర్పాటు చేశారు. జిల్లాలో మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్, పద్మసాగర్, శ్రీనివాససాగర్, వేణుగోపాలసాగర్, వేపగుంట రిజర్వాయర్ మీదుగా నగరి రూరల్ మండలంలోని అడవికొత్తూరులో నిర్మించే రిజర్వాయర్‌కు చేరుకుంటుంది. మహానేత పాలనలో 70 శాతం పూర్తి అయిన ఈ ప్రాజెక్టు ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
ఈటీపీ ప్లాంటు
నూలుకు రంగువేసే ప్రక్రియలో వెలువడే రసాయన నీటి కారణంగా భూగర్భజలాలు కలుషితమవుతుండడంతో కొన్నేళ్ల క్రితం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి డైయింగ్ యూనిట్‌కు ఈటీపీ అమర్చుకోవాలని లేకుంటే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. డైయింగ్ యూనిట్లు ఈటీపీ పెట్టుకోవాలంటే రూ.20 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చుచేయలేని స్థితిలో వారు ఉండడంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రసాయన నీటిని శుభ్రపరిచే కామన్ ఈటీపీ ప్లాంటు ఏర్పాటుకు సంసిద్ధత తెలిపి, రూ. 14 కోట్ల మంజూరు చేశారు. ఆయన పాలనలో వేగంగా జరిగిన పనులు ఆయన మరణంతో మందగించింది. తర్వాత గతంలో ఎమ్మెల్యే రోజా ప్లాంటును ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు.
వంద పడకల ఆస్పత్రి..
మహానేత పాలనలో నగరికి రూ.15 కోట్ల వ్యయంతో వందపడకల ఆస్పత్రి మంజూరైంది. ఆధునిక హంగులతో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభ మైన ఈ ఆస్పత్రి వైఎస్సార్ మరణానంతరం 60 పడకలకే పరిమితమైంది. గత పాలనలో ఆస్పత్రి అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారు.
సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు
నగరి తాగునీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపడానికి మున్సిపల్ పరిధి సత్రవాడ శివారుల్లో రూ.36 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. గాలేరు నగరి ప్రాజెక్టును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు అనుసంధానం చేశారు.
నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం
2006లో అధికారికంగా శ్రీసిటీ సెజ్‌కు పచ్చజెండా ఊపి 2008 ఆగస్టు 8వ తేదీన 8 పరిశ్రమలకు అప్పట్లో సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 8 పరిశ్రమలతో మొదలైన శ్రీసిటీ పారిశ్రామికవాడ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు రూ.60 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 27 దేశాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆంధ్ర–తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని వెనుకబడిన ప్రాంతమైన సత్యవేడు నియోజకవర్గం 2004–2009 మధ్యలో అన్ని విధాలా అభివృద్ధి చెందింది. అప్పటి సత్యవేడు ఎమ్మెల్యే నారాయణస్వామి చొరవతో నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేయూతనిచ్చారు.
2004లో వైఎస్సార్ రాజీవ్ పల్లెబాట పేరిట జిల్లాలోనే సత్యవేడు నియోజకవర్గంలో తొలిసారిగా పర్యటించిన ఆయన వరాల జల్లుతో ప్రాంతం అభివృద్ధికి నాంది పలికారు. సత్యవేడులో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు ఉబ్బలమడుగు, భూవతేశ్వరకోన, రాళ్లవాగు నీటి ప్రాజెక్టుల ఏర్పాటు చేశారు. సత్యవేడుకు కలగా మిగిలిన డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, తొమ్మిది హైస్కూళ్లు, ఒక తమిళ మీడియం స్కూల్ ఏర్పాటు చేయడంతో ఇంటర్ తర్వాత ఉన్నత విద్యకు విద్యార్థులకు కష్టాలు తప్పాయి. దీంతో నియోజకవర్గంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మహానేతను విద్యాదాతగా ఇప్పటికీ సర్మించుకుంటున్నారు.
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వైఎస్సార్ మానసపుత్రికగా నిలిచిపోయింది. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఏర్పాటుకు 2004 సెప్టెంబర్ 30వ తేదీన బీజం పడింది. అప్పటి సీఎం వైఎస్సార్ తిరుపతి వెటర్నరీ కళాశాల స్వర్ణత్సోవాలకు ముఖ్య అతిథిగా హాజరై కళాశాలకు యూనివర్సిటీ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. 2005 జూలై 15వ తేదీన వర్సిటీగా గుర్తింపు ఇచ్చారు. మొత్తం రూ.145 కోట్లు మౌలికవసతుల కల్పనకు కేటాయించారు.
వర్సిటీ పరిధిలో తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు, గరివిడి వెటర్నరీ కళాశాలలు తిరుపతిలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, ముత్తుకూరులో మత్స్య కళాశాలలు ఉన్నాయి. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలు 30 ఉన్నాయి. వీటిలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులతో పాటు అనిమల్ హస్బెండరీల పాలిటెక్నిక్ కోర్సులు సైతం ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య 3 వేలకు పైగా చదువుతున్నారు. అధ్యాపకులు 305, బోధనేతర సిబ్బంది 2,545 మంది వరకు ఉన్నారు. అలాగే ప్రపంచలోనే పేరొందిన పుంగనూరు, ఒంగోలు జాతి పశు సంతతి అభివృద్ధికి పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు.

● సంక్షేమ సంతకాలు ● తిరుపతిలో వర్సిటీ ● సత్యవేడులో శ్రీ