
ఆంక్షలతో జగన్ పర్యటనను ఆపలేరు
బంగారుపాళెం: మామిడి రైతులకు అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు వస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. జగన్ రాకకోసం కొత్తపల్లె హైవే సమీపంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ను, బంగారుపాళెంలోని మామిడి మార్కెట్ యార్డ్‌ను మంగళవారం పార్టీ నేతలతో కలసి ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో మామిడి రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్నప్పుడు ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. వైఎస్సార్‌సీపీకి సంబంధించిన నాయకులు రాకూడదు.. ఇంత మందే రావాలి.. అంటే ఎట్లని ప్రశ్నించారు. అనుమతి ఇచ్చి.. కట్టడి చేసినట్టుగా ఉందని చెప్పారు. నాయకులెవర్నీ బయటకు రాకుండా చేసి జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్కరినే మామిడి మార్కెట్ యార్డులోకి అనుమతించి టీడీపీ నాయకుల చేత అడ్డుకునే కుట్ర జరుగుతోందన్నారు. రూపాయికి కూడా కొనలేమని చెప్పిన ఫ్యాక్టరీ యజమానులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకుని రూ.6 కొనుగోలు చేస్తామంటూ టోకన్లు జారీ చేస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్‌కుమార్, లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా పాల్గొన్నారు.