
రేపు మెగా పీటీఎం 2.0
● మండల స్థాయి అధికారులకు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు ● ప్రతి పాఠశాలలో ఒక అధికారి పాల్గొనాలి ● ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కార్యక్రమాలు ● ప్రత్యేకంగా తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమం ● కలెక్టర్ సుమిత్‌కుమార్ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం 2.0)ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం క్షేత్ర స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలోని ఎంఈవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్, అర్బన్ ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. మెగా పీటీఎం కు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు కచ్చితంగా ఒక్కొక్క పాఠశాలలో కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమ నిర్వహణ పై ఇదివరకే ఆయా ఆదేశాలివ్వడం జరిగిందన్నారు.
ఉదయం 9కే కార్యక్రమం
జిల్లాలోని ప్రభుత్వ 2,437, ప్రైవేట్ 506, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 50 మొత్తం 2,993 విద్యాసంస్థల్లో తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉన్న 1,32,996 మంది, ప్రైవేట్ కళాశాలల పరిధిలోని 86,162, జూనియర్ కళాశాలల పరిధిలోని 7,576 మొత్తం 2,26,734 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు స్కూల్ గ్రాంట్స్‌లో రూ.2.68 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 11 గంటల వరకు తల్లిదండ్రులతో సమావేశం, 11 నుంచి 11.20 గంటల వరకు ఆటల పోటీలు, 11.30 నుంచి పాఠశాల ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, అధికారులు, దాతల ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. అనంతరం విద్యార్థుల తల్లి పేరుతో పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారని కలెక్టర్ వివరించారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ పాల్గొన్నారు.