
చిత్తూరులో పేట్రేగుతున్న.. ‘పచ్చ’ మాఫియా!
● రూ.3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా ● ఒక్కో ప్లాటు రూ.7 లక్షలకు విక్రయం ● కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లడంతో ఆగిన కబ్జా ● ఆలస్యంగా మేల్కొన్న అధికారులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులో కూటమికి చెందిన నాయకుల కన్ను రూ.కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములపై పడింది. ఇప్పటికే నగరంలో రాత్రిపూట ఎలాంటి బిల్లులు లేకుండా గ్రానైట్ తరలించడం, సివిల్ పంచాయితీలు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్న ప్రధాన ముఠా.. తాజాగా ప్రభుత్వ భూములపై కన్నేశారు. నగరంలోని మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన దాదాపు రూ.3 కోట్ల విలువచేసే స్థలాన్ని చదునుచేసి, రాళ్లు నాటి, ప్లాట్లు వేశారు. అంతటితో ఆగకుండా పలువురికి ప్లాట్లు కూడా అమ్మేశారు. ఆలస్యంగా మేల్కొన్న యంత్రాంగం పోలీసుల రక్షణతో గురువారం భూమిని స్వాధీనం చేసుకుంది.
రూ.కోట్ల విలువైన భూమి
నగరంలోని మంగసముద్రం వద్ద మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన డంపింగ్ యార్డు ఉంది. దీని పక్కనే సర్వే నం.113లో దాదాపు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ఆనుకునే మంగసముద్రం మీదుగా తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారి కూడా ఉంది. ఈ రెండు ఎకరాల భూమి మార్కెట్ విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన ఓ క్లస్టర్ ఇన్‌చార్జ్ కన్ను ప్రభుత్వ భూమిపై పడింది. ఎలాగైనా దీన్ని కబ్జా చేయాలని భావించి, ఓ కూటమి నేత అనుచరుడిని ఆశ్రయించాడు. ‘అన్నా, ఇద్దరం కలిసి లే–అవుట్ వేద్దాం. పెట్టుబడి నాది. లాభంలో ఇద్దరికీ చెరిసగం. నువ్వు అండగా ఉంటే చాలు. వార్డు ఇన్‌చార్జ్ కూడా మనకు సపోర్ట్ చేస్తాడు...’ అంటూ ఆ వ్యక్తిని ఇందులోకి దించాడు. చిన్నపాటి గుట్టలు, ముళ్లకంపలు ఉన్న రెండు ఎకరాల భూమిని వారం రోజుల్లో శుభ్రం చేయడం, అందులో రాళ్లు నాటడం, 35కు 25 సైజులో ప్లాట్లు వేయడం చకచకా ప్రారంభించేశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్లాట్లను చూపించి, ఒక్కో ప్లాటు రూ.7 లక్షలకు అమ్ముతున్నట్లు ప్రచారం చేయడంతో.. చాలామంది ముందుకు వచ్చి ప్లాట్లు కూడా కొనేశారు.
కలెక్టర్ ఛీవాట్లు పెట్టడంతో..
ఇక్కడ జరుగుతున్న భూ కబ్జా బాగోతంపై కార్పొరేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. నిత్యం ఇటువైపు కార్పొరేషన్ డంపింగ్ వాహనాలు, అధికారుల నుంచి కార్యదర్శుల వరకు తిరుగుతున్నారు. కానీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది అధికార పార్టీ నేతలు కావడంతో ఎవ్వరూ నోరు మెదపలేదు. చివరకు విషయం కలెక్టర్ వరకు వెళ్లింది. కలెక్టర్ కల్పించుకుని రెవెన్యూ, మునిసిపల్ అధికారులకు ఛీవాట్లు పెట్టడంతో అధికారులు ఉరుకులు పరుగులతో ఇక్కడకు చేరుకున్నారు. గురువారం రాత్రి 8 గంటల వరకు ఇక్కడే ఉన్న మునిసిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర, రెవెన్యూ అధికారులు.. ప్రభుత్వ భూమిలో పాతిపెట్టిన రాళ్లను తొలగించి, జేసీబీ సాయంతో కంచెను వేసే ప్రక్రియ చేపట్టారు.
ఎంత ధైర్యం?
ప్రభుత్వ భూమిని చెరపట్టాలంటే సామాన్యులకు వీలుకాదు. అధికార పార్టీ అండదండలు, ప్రజాప్రతినిధికి వాటాలు ఇస్తేనే ప్రభుత్వ భూమిని కబ్జాచేసే ధైర్యం వస్తుంది. చిత్తూరులో రూ.కోట్ల విలువచేసే భూమిలో ధైర్యంగా రాళ్లు నాటి, విక్రయించే స్థాయికి వెళ్లారంటే.. ఆ టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్‌కు ఎంతటి అధికార పార్టీ అండ దండలు లభించాయోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు. మరి దీనిపై కూటమి నేతలు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి. మరోవైపు ఇది తమ వంశపారంపర్య భూమి అంటూ స్థానిక వ్యక్తి ఒకరు అధికారులకు పలు పత్రాలను అందచేశాడు. ఆన్‌లైన్ అడంగల్ నివేదికలో పరిశీలిస్తే ఇది ప్రభుత్వ భూమిగా ఉందన్న అధికారులు, కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని చెప్పారు.

చిత్తూరులో పేట్రేగుతున్న.. ‘పచ్చ’ మాఫియా!