
పకడ్బందీగా పీఎం ఉద్యోగ కల్పన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం అమలు చేయాలన్నారు. పరిశ్రమలు నెలకొల్పితేనే యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు అనుమతులు ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని కోరారు. యువత ఉపాధి కల్పన కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8.39 కోట్లతో 547 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలతో ఉత్పత్తులు ప్రారంభించారని వివరించారు. వీటిలో 1,604 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. రూ.3,494 కోట్లతో 13 భారీ, మధ్య తరహా, రూ.117 కోట్లతో 38 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇవి ప్రారంభమైతే దాదాపు 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సింగిల్ డెస్క్ విధానంలో 532 దరఖాస్తులను ఆమోదించామని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అమలు చేస్తున్నందున దరఖాస్తులు స్వీకరించి పకడ్బందీగా పరిశీలించాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన లో 2,131 యూనిట్‌లకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇందులో 1,843 మందికి లబ్ధి చేకూర్చి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జెడ్‌ఎం సుబ్బారావు, ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమల అసోషియేషన్ ప్రతినిధి కట్టమంచి బాబీ పాల్గొన్నారు.