
ప్రశ్నిస్తే కేసులా?
గంగాధర నెల్లూరు: కూటమి ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం గంగాధరనెల్లూరు మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా నాయకురాలైన కృపాలక్ష్మి రాజకీయంగా ఎదుగుతున్న పరిస్థితిని ఓర్వలేక, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కృపాలక్ష్మి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు ఎవర్నీ కించపరిచే విధంగా మాట్లాడలేదని, సోషల్ మీడియాలోని ఇన్‌స్ట్రాగామ్‌లో అకౌంటే లేదని తెలిపారు. జనసేన నాయకులు ఉద్దేశపూర్వకంగానే కృపా లక్ష్మిపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. తన బిడ్డ పోస్టింగ్ చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, జిల్లా మాజీ సీడీసీఎంఎస్ చైర్మన్ వేల్కూర్ బాబురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి. మాజీ రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గుణశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు మునిరాజారెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, సర్పంచ్ సుబ్రహ్మణ్యంయాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏకాంబరం, యువజన విభాగం అధ్యక్షులు కిషోర్‌రెడ్డి పాల్గొన్నారు.