
పిల్లల భవిష్యత్తుతో ఆటలా..?
● పాఠశాలల విలీనంపై ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసన
యాదమరి: పసిపిల్లల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని పాచిగుంట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు పెరుమాళ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభం శుభం తెలియని చిన్న పిల్లలను స్థానిక పాఠశాలను విడిచి వేరే ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకోమనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తమ గ్రామంలోని పాఠశాలలోని 3,4,5 తరగతి విద్యార్థులు 26 మందిని పచ్చాపూరు, సిద్ధారెడ్డిపల్లి, కాశిరాళ్ల పాఠశాలలో విలీనం చేశారని చెప్పారు. ఈ మార్గంలో ప్రమాదకరమైన మలుపులు, బావులు, చెరువులున్నాయన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోకుండా కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం చిన్న పిల్లల భవితపై అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని ఎంఈఓ రుక్మిణి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ కుబేంద్రన్, వైస్ ప్రెసిడెంట్ కవిత, రాము తదితరులు పాల్గొన్నారు.